తిరుమల లడ్డూ కల్తీపై తిరుమలలో మహా శాంతి యాగం

తిరుమల లడ్డూ కల్తీపై తిరుమలలో మహా శాంతి యాగం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం  కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన టీటీడీ ఆ క్రతువులో భాగంగా తొలుత మహా శాంతి యాగాన్ని నిర్వహించాలని శనివారం నిర్ణయించింది. 
 
మూడు రోజులపాటు ఈ క్రతువు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు శాంతియాగాన్ని జరపనున్నారు. వేదపండితులు, రుత్వికుల నడుమ శ్రీ వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.  తిరుమల శ్రీవారి వారి లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 
 
టీటీడీ ఈవో, అధికారులతో శుక్రవారం రెండుసార్లు ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి ముందు గత వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కాగా, శనివారం లడ్డూ అపవిత్రంపై టీటీడీ ఈవో శ్యామలరావు అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, అర్చకులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆగమ సలహా మండలి సభ్యులు వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ పండితులు మోహనరంగాచార్యులు, సీతారామాచార్యులు, పలువురు అర్చకులు పాల్గొన్నారు.

ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలనే ఆభిప్రాయాలు వస్తున్నాయని, దీనిపై ఆగమశాస్త్రంలో ఎలాంటి చర్యలు చేపట్టాలని ఉందనే అంశాలపై చర్చించారు. నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో పరిహారం కింద ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈవో ప్రశ్నించారు. ఆగమ సలహా మండలి సభ్యులు స్పందిస్తూ.. అనుమానాలు తలెత్తిన క్రమంలో శుద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఆగమ సలహా మండలి సభ్యులతో పాటు ఇతర ప్రధాన అర్చకులు, అర్చకులు, సీనియర్‌ పండితులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నంలోగా శుద్ధి నిర్వహణపై పూర్తిస్థాయి ప్రణాళిక ఇవ్వాలని ఈవో కోరారు.

లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎం చంద్రబాబుకి టీటీటీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. మరింత సమాచారాన్ని టీటీడీ అధికారులు ఆదివారం అందజేయనున్నారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో వచ్చిన సూచనలను ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. తిరుమల పవిత్ర కాపాడే విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు.