ఇజ్రాయెల్‌పై 140 మిస్సైల్స్‌తో హిజ్బుల్లా దాడి

ఇజ్రాయెల్‌పై 140 మిస్సైల్స్‌తో హిజ్బుల్లా దాడి
* హెజ్బొల్లా టాప్‌ కమాండర్‌ ఇబ్రహీం సహా 8 మంది మృతి
 
ఇజ్రాయెల్‌ – లెబనాన్‌ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పేలుళ్లు ఇజ్రాయెల్‌ పనేనని ఆరోపించిన హెజ్బొల్లా ప్రతిదాడులు తప్పవని హెచ్చరించిన తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది.  హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంటూ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణులతో దాడులకు దిగింది.
మరోవైపు హెజ్బొల్లా సైతం ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. ఒకవైపు గాజాలో ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం ముగుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌ – హెజ్బొల్లా మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తడం ఆందోళనకరంగా మారింది. లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై గురువారం నుంచి ఇజ్రాయెల్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నది. దక్షిణ బీరుట్‌లోని జేమస్‌ స్ట్రీట్‌ ప్రాంతంలో ఓ భవనంపై జరిగిన దాడిలో అనేక మంది గాయపడ్డారు.
క్ఫర్‌ కిలా పట్టణంలోని హెజ్బొల్లా శిబిరంపైనా దాడి చేసింది.  ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్బొల్లా టాప్‌ కమాండర్‌ ఇబ్రహీం అఖిల్‌ సహా ఎనిమిది మంది మరణించారని, 59 మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై శుక్రవారం 140 కత్యూషా రాకెట్లతో దాడి చేసినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. 

ఇజ్రాయెల్‌ వాయు రక్షణ కేంద్రాలతో పాటు సైనిక బ్రిగేడ్‌ కేంద్రంపై దాడి చేసినట్టు చెప్పింది. గోలన్‌ హైట్స్‌, సఫేర్‌, అప్పర్‌ గలిలీ ప్రాంతంలో హెజ్బొల్లా దాడి చేసినట్టు ఇజ్రాయెల్‌ నిర్ధారించింది. ఈ పరస్పర దాడుల్లో ఇరువైపులా భారీగానే ఆస్తినష్టం జరిగిందని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. . 

మరో వైపు  హెజ్బొల్లాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతున్నది. గత ఏడాదికాలంగా గాజాలో హమాస్‌పై పోరాడుతున్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్నది. గాజాలో యుద్ధ తీవ్రత తగ్గడంతో ఇప్పుడు హెజ్బొల్లాకు కేంద్రమైన లెబనాన్‌ సరిహద్దుకు బలగాలను మోహరిస్తున్నది.

పేజర్ల పేలుడు ఇజ్రాయెల్‌ చేసిన యుద్ధ ప్రకటనే అని హెజ్బొల్లా సెక్రటరీ జనరల్‌ హస్సన్‌ నస్రల్లా వ్యాఖ్యానించగా, ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలను తిరిగి వారి ఇండ్లకు చేర్చేందుకు యుద్ధం తప్పదని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హెర్జాగ్‌ వ్యాఖ్యానించడం యుద్ధానికి ఇరువైపులా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది.

గాజాలో జరిగిన పోరులో కీలకంగా వ్యవహరించిన వేలాది మంది సైనికులతో కూడిన 98వ డివిజన్‌ను లెబనాన్‌ వైపు పంపిస్తున్నది.  ‘యుద్ధంలో కొత్త దశ మొదలైంది’ అంటూ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యావ్‌ గాల్లంట్‌ ప్రకటించారు. హెజ్బొల్లాను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకోనున్నదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

గురువారం రాత్రి లెబనాన్‌లో లోతట్టు ప్రాంతాలపై యుద్ధ విమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. ఇందుకు ప్రతిగా ఇప్పుడు హెజ్‌బొల్లా పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఇజ్రాయెల్ సామూహిక రీతిలో తమపై జరుపుతున్న దాడులలో పౌర సముదాయ నివాసిత ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతోందని, దీనిని సహించేది లేదని హెజ్‌బొల్లా తెలిపింది.

ఇప్పుడు హెజ్‌బొల్లా నుంచి తమ భూభాగంపైకి రాకెట్ల దాడులు జరిగిన విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా నిర్థారించింది. లెబనాన్‌తో ఉండే సరిహద్దుల్లో మూడంచెలుగా ఈ దాడి జరిగిందని వివరించారు. అయితే తాము ఇందుకు ప్రతిగా ఇక దక్షణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలను, నిర్మాణ వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రతిదాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 

తాము ఇజ్రాయెల్ భూతలంపైకి కత్యుషా రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ స్పందిస్తూ గోలన్ హైట్స్ ప్రాంతాలలో 120 వరకూ క్షిపణుల దాడులు జరిగాయని నిర్థారించింది. వీటిలో కొన్నింటిని తాము దెబ్బతీసినట్లు తెలిపిన ఇజ్రాయెల్ తమ ప్రాంతంలో ఏదైనా ప్రాణనష్టం , ఆస్తినష్టం జరిగిందీ ? లేనిది తెలియచేయలేదు. 

సదరన్ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సేనలు తరచూ గ్రామాలపై , ఇండ్లపై దాడులకు దిగుతున్నాయని, వీటిని తాము చూస్తూ ఊరుకునేది లేదని హెజ్‌బొల్లా స్పష్టం చేసింది. మరోవంక, హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాల్సిన వందలాది రాకెట్ లాంచర్ బారెల్స్ని ఫైటర్‌జెట్‌లు బాంబులు వేసి ధ్వంసం చేసినట్లు సైన్యం పేర్కొంది.