
భారతదేశం “అసహనం”తో కూడిన తీవ్రవాద ముప్పులను ఎదుర్కొంటుందని ఉగ్రవాద నిధులపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) హెచ్చరించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌తో పాటు చుట్టుపక్కల ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి వంటి ఉగ్ర సంస్థలతో భారత్‌కు తీవ్రమైన ఉగ్రవాద, ఉగ్ర నిధుల ముప్పు ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఉగ్రవాదులకు ఆర్ధిక సహకారం, మనీ లాండరింగ్ వ్యవస్థలను ఎదుర్కోవడంపై భారత దేశంతో కలిసి రూపొందించిన నివేదికలో అక్రమ నగదుకు అడ్డుకట్ట వేయడంలో భారత్ సమర్థంగా వ్యవహరిస్తున్నదని ప్రశంసించింది. భారత్ తమ సిఫారసులు అమలు చేసి అక్రమంగా నిధులు ప్రవేశించకుండా అత్యున్నత సాంకేతిక సామర్థ్యాన్ని పొందిందని పేర్కొన్నది.
అయితే, ఉగ్రవాద నిధులు, మనీ లాండరింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారంకోసం ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేయడానికి కీలకమైన పురోగతి అవసరమని సూచించింది. 368 పేజీల నివేదికలో, ఉగ్రవాద నిధుల దుర్వినియోగం నుండి రంగానికి రక్షణ కల్పించే చర్యలు అవసరమని పేర్కొంది. పేర్కొంది. లాభాపేక్ష లేని రంగాన్ని ఉగ్రవాద నిధుల కోసం దుర్వినియోగ పరచకుండా నిరోధించే లక్ష్యంతో తీసుకొంటున్న చర్యల పట్ల ఆయా సంస్థలకు ఉగ్రవాద నిధుల ప్రమాదాలపై అవగాహన కల్పించడం ద్వారా జాగురత వహించాలని నివేదిక సూచించింది.
భారత దేశంలో ఉగ్రవాదంపై నిధులు దేశంలో నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాల నుండే లభిస్తున్నాయని స్పష్టం చేసింది. గత ఐదేళ్లలో భారతదేశంలో మనీలాండరింగ్ నేరారోపణలు రాజ్యాంగపరమైన సవాళ్లు, వ్యవ్యస్థలలో సుదీర్ఘకాలం కొనసాగడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారతదేశ న్యాయస్థానాలలో అనేక కేసులు సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా ఉండటాన్ని ప్రస్తావించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఐదేళ్లలో అనుమానిత ఆర్థిక నేరగాళ్ల నుండి 10.4 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొంటే, నేరారోపణల తరువాత జప్తు చేసింది 5 మిలియన్ డాలర్లకంటే చాలా తక్కువ అని నివేదిక పేర్కొంది. “కేసుల విచారణ, ప్రాసిక్యూషన్ల కోసం ఎదురు చూస్తున్న నిందితుల దృష్ట్యా భారతదేశం ఈ సమస్యలను పరిష్కరించడం చాలా క్లిష్టమైనది” అని వివరించింది.
“భారతదేశంలో మనీలాండరింగ్ ప్రధాన వనరులు దేశంలోని చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి ఉద్భవించాయి” అని ఎఫ్ఏటీఎఫ్ నివేదిక పేర్కొంది. భారతదేశం కోసం ఎఫ్ఏటీఎఫ్ నాల్గవ రౌండ్ పరస్పర మూల్యాంకనం నవంబర్ 2023లో జరిగింది. ఈ సంవత్సరం జూన్ 26-28 మధ్య సింగపూర్‌లో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ ఈ నివేదికను ఆమోదించింది.
ఎఫ్ఏటీఎఫ్ భారతదేశాన్ని “రెగ్యులర్ ఫాలో-అప్” కేటగిరీలో ఉంచింది. ఇది గ్లోబల్ వాచ్డాగ్ ఇచ్చిన అత్యధిక రేటింగ్. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలతో సహా నాలుగు ఇతర జి20 దేశాలకు మాత్రమే ఈ రేటింగ్ లభించింది. 220 మందికి పైగా మృతి చెందడానికి దారితీసిన గత సంవత్సరంకు పైగా మణిపూర్ లో నెలకొన్న హింసాయుత వాతావరణాన్ని కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. మానవ అక్రమ రవాణా, స్ముగ్గ్లింగ్ కార్యక్రమాల ద్వారా జరుగుతున్న ఉగ్రనిధులను కట్టడి చేయడంలో కొన్ని లోపాలు ఉన్నట్లు నివేదిక భావించింది.
More Stories
బిహార్ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించే లక్ష్యం
తొలి టెస్టులో భారత్ వెస్టిండీస్‌పై ఘన విజయం
నవంబరు 23న భారత్‌కు నీరవ్ మోదీ?