బెంగాల్‌ వైద్యుల సమ్మె పాక్షిక విరమణ

బెంగాల్‌ వైద్యుల సమ్మె పాక్షిక విరమణ

* ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

హత్యాచారానికి గురైన పీజీ వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ 41 రోజులుగా సమ్మె చేస్తున్న బెంగాల్‌ వైద్యులు ఎట్టకేలకు కాస్త శాంతించారు. ప్రభుత్వం తమ డిమాండ్లలో చాలావరకు ఆమోదించడంతో పాటు, రాష్ట్రంలో భారీ వరదల రీత్యా సమ్మెను పాక్షికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు.  అయితే, ఔట్‌ పేషంట్‌ సేవలను మాత్రం అందించబోమని చెప్పారు.
మరోవైపు బెంగాల్‌ సర్కారు వైద్యుల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. తక్షణమే అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఆస్పత్రుల్లో విధుల్లో ఉన్న వైద్యులకు సరిపడా గదులు, వాష్‌ రూమ్‌లు ఉండేలా చూడడం, సీసీ టీవీలు, తాగునీటి వసతులు కల్పించడం తదితరాలు ఇందులో ఉన్నాయి.
 
వీటిని తక్షణమే సమకూర్చాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, సీబీఐ నివేదికకు ఇంకెంత సమయం తీసుకుంటారని ప్రశ్నిస్తూ వైద్యులు స్వాస్థ్య భవన్‌ ఎదుట 9 రోజులుగా ధర్నా చేస్తున్నారు. దీనిని శుక్రవారం విరమించి సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.  మరోవైపు తమ డిమాండ్ల అమలుకు సర్కారుకు వారం రోజుల గడువు ఇచ్చిన వైద్యులు, అవి నెరవేరకుంటే మళ్లీ పూర్తిస్థాయి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. 
 
ఆర్జీకర్‌ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్తోరాయ్‌ విచారణ నిమిత్తం గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆర్జీకర్‌ ఆస్పత్రిలో హత్యాచార ఘటనకు సంబంధించి టీఎంసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆ పార్టీ నేత జవహర్‌ సిర్కార్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
 
మరోవంక, పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసింది. 
 
ఈ నేపథ్యంలో సీబీఐ కస్టడీలో ఉన్న డాక్టర్‌ సందీప్ ఘోష్‌ను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి తొలగించినట్లు డబ్ల్యూబీఎంసీ తెలిపింది. బెంగాల్ మెడికల్ యాక్ట్ 1914 నిబంధనల ప్రకారం ఆయన లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొంది.  ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ)ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గతంలో కోరింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూబీఎంసీ చర్యలు చేపట్టింది. 
 
సెప్టెంబర్ 7న ఘోష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సందీప్ ఘోష్ ఈ నోటీస్‌కు స్పందించలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ మెడికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు డబ్ల్యూబీఎంసీ వెల్లడించింది.