ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణం

ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియామకమయైన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ప్రమాణస్వీకారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం  పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతిషి కొత్తగా సీఎంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. 
 
అయితే, ప్రమాణస్వీకారం తేదీని మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించలేదు. రాష్ట్రపతి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో శుక్రవారం నాటికి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌లోనే ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని భావిస్తున్నారు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అతిషి నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వ తొలి మంత్రివర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.  పథకం కోసం ఢిల్లీ సర్కారు బడ్జెట్‌లో రూ.2వేలకోట్లు కేటాయించింది. ఈ పథకంలో ఢిల్లీలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇవ్వాలని నిర్ణయించారు.
 
అక్టోబర్‌ తొలివారంలో ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. మరో వైపు కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతున్నది. కేబినెట్‌లో పాత మంత్రులతో పాటు మరో కొత్త ముఖాలకు సైతం ఛాన్స్‌ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న పదవులపై ప్రాంతీయ, కుల సమీకరణాలు సమతూకంపై పార్టీ కసరత్తు చేస్తున్నది.

ఆప్‌ పదేళ్ల పాలన తర్వాత సీఎంకు సైతం శాఖలు ఉండనున్నాయి. విద్య, పబ్లిక్‌ వర్క్స్‌తో పాటు పలు కీలకమైన శాఖలను తనవద్దే ఉంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది ఇంతకు సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌ తన వద్ద ఏ ఒక్కశాఖను ఉంచుకోలేదు. కొంతకాలం జలమండలి బాధ్యతలు చూసినా.. ఆ తర్వాత మరొకరికి అప్పగించారు.