కేజ్రీవాల్‌ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే!

కేజ్రీవాల్‌ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రెండు రోజులలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చేసిన ప్రకటన ఎన్నికల కోసం జరిపిన ప్రచార ఎత్తుగడ మాత్రమే అని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి.

కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రముఖంగా ప్రచారంలోకి రావడానికి కారణమైన ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారే ఈ రాజీనామా నిర్ణయం పట్ల పెదవి విరిచారు. అతని మనసులో ఏముందో తనకు తెలియదని అంటూ తనతో కలిసి పనిచేస్తున్నప్పుడు రాజకీయాలలోకి వెళ్లవద్దని చెప్పానని, సామాజిక సేవలో ఎంతో సంతృప్తి మిగులుతుందని, ప్రజాదరణ కూడా లభిస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశానని గుర్తు చేశారు. అయితే తనమాట వినలేదని తెలిపారు.

ఇది తన ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భాగమేనని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్‌ భండారి తెలిపారు. ఢిల్లీ వాసుల్లో కేజ్రీవాల్‌ అవినీతిపరుడనే ముద్ర పడుతోందని గ్రహించినందునే దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇక కేజ్రీవాల్‌ సీఎం పదవి నుంచి తప్పుకోవడం త్యాగమేమీ కాదని స్పష్టం చేశారు.

‘ఇది అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఆర్‌ స్టంట్‌. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీగా పేరుపొందింది. పీఆర్‌ స్టంట్‌తో మళ్లీ ఇమేజ్‌ను పెంచుకోవాలని భావిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ను డమ్మీ ప్రధానిని చేసి తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపిన సోనియా నమూనానే అమలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది’ అని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుందని స్పష్టం చేస్తూ ఢిల్లీ ప్రజలు తన పేరుపై ఓట్లు వేయరని, అందుకే వేరొకరిని బలిపశువును చేయాలనుకుంటున్నారని విమర్శించారు.

కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఢిల్లీ ప్రజల విజయం అని మరో అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది స్పష్టం చేశారు. భారత దేశ చరిత్రలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రవేశింప రాదనీ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన మొదటి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముందుకు జరపాలని ఎందుకు కోరుతున్నారు? తన పార్టీలో చీలిక వస్తుందని భయపడుతున్నారా? అని సుధాన్షు త్రివేది ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి  కార్యాలయంలోకి తిరిగి ప్రవేశం, ఫైళ్లపై సంతకాలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత మణిందర్‌ సింగ్‌ సిర్సా పేర్కొన్నారు. తదుపరి సీఎంగా తన భార్య సునీతా కేజ్రీవాల్‌ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను ఒప్పించేందుకే సీఎం రెండు రోజుల గడవుతు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. 

ఇక ముఖ్యమంత్రి నిర్ణయం కేవలం ప్రచార ఎత్తుగడని కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్ అభివర్ణించారు. ఆయన ఎప్పుడో రాజీనామా చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత సీఎంఓకు తిరిగివచ్చి ఫైళ్లపై సంతకాలు చేయరాదని ఓ సీఎంను సుప్రీంకోర్టు కోరడం ఇదే తొలిసారని ఆయన గుర్తుచేశారు. 

ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందనే కోర్టు ఆందోళన ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోందని తెలిపారు. కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు నేరస్తుడిగా పరిగణిస్తున్నదని ఆయన ఆరోపించారు. లిక్కర్‌ పాలసీ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈనెల 13న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.