
జ్ఞాన్‌వాపి అనేది మసీదు కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అది శివుడి దేవాలయమని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన్‌వాపిని మసీదుగా పేర్కొంటున్నారని, దీంతో పరమేశ్వరుడి సన్నిధికి వచ్చే భక్తులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన చెప్పారు.
ఇది జాతీయ ఐక్యత, సమగ్రతకు కూడా అతిపెద్ద అడ్డంకిగా మారిందని విచారం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ అడ్డంకిని అర్థం చేసుకుని అప్రమత్తం అయ్యి ఉంటే భారత్ ఎన్నటికీ వలస పాలకుల వశమయ్యేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు జ్ఞాన్‌వాపి ప్రాంతంలో శివాలయాన్ని కూల్చి మసీదును కట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వాదనలను ముస్లిం పక్షాలు ఖండిస్తున్నాయి. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు జరిగిన వీడియో సర్వేలో మసీదు అని చెబుతున్న ప్రాంతంలో హిందూ దేవతల విగ్రహాలు కనిపించాయి. వాజూఖానాలోని ఓ కొలనులో శివలింగం ఆకారం వెలుగులోకి వచ్చింది.
దీనిని ఫౌంటెన్ అని మసీదు పెద్దలు చెబుతుండగా మొఘల్ చక్రవర్తే గుడిని కూల్చేసి మసీదు కట్టించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇరుపక్షాలు న్యాయస్థానం తలుపులు తట్టగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు సీలు చేసిన నేలమాళిగలో హిందూ భక్తులను పూజించడానికి అనుమతించింది.
కోర్టు ఆదేశం ప్రకారం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులోని నిషేధిత ప్రాంతమైన ‘వ్యాస్ కా టెఖానా’లో హిందూ భక్తులను ప్రార్థనలు చేయడానికి అనుమతించారు. డిసెంబర్ 2019లో బాబ్రీ మసీదు, అయోధ్య రామాలయం వివాదంపై తీర్పు వెలువడిన నెల తరువాత జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలనే డిమాండ్‌తో వారణాసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ వారం ప్రారంభంలో హిందూ పక్షం భారత పురావస్తుశాఖ సర్వే అధికారులను మసీదు ప్రాంగణంలో తవ్వకానికి అనుమతించాలని వారణాసి కోర్టును అభ్యర్థించింది. దీనిపై సెప్టెంబర్ 18న కోర్టు తీర్పు వెలువరించనుంది.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’