లౌకిక కాంగ్రెస్ `సెక్యులర్ హైడ్రా’ నడిపించాలి

లౌకిక కాంగ్రెస్ `సెక్యులర్ హైడ్రా’ నడిపించాలి
లౌకిక పార్టీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ‘సెక్యులర్ హైడ్రాను’ నడిపించాలని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. కబ్జా నిర్మాణాలను ఎంపిక చేసి కూల్చడం మాత్రమేకాకుండా ప్రణాళికాబద్దంగా నేలమట్టం చేయాలని సూచించారు. రెండు రోజులకొసారి హైడ్రా విధానం మారకూడదని అర్వింద్ హితవు పలికారు. హైడ్రా పాత బస్తీకి వెళ్లడానికి వెనకడుగు వేస్తుందని ఆరోపించారు.

అసెంబ్లీలోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎల్పీసమావేశం నిర్వహించారు. ఎల్పీనేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజాసింగ్ మినహా బీజేపీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరయ్యారు.  ఈ సమావేశంలో పది అంశాలపై చర్చించినట్లు పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

అర్హులకు రేషన్ కార్డులు, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ నెల 20న ‘రైతు దీక్ష’ చేయాలని నిర్ణయించినట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.  వరద ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కేంద్రాన్ని నిందించడం సబబు కాదని హితవు పలికారు.

“తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టంపై తాము పూర్తిగా ఆదుకుంటామని కేంద్రప్రభుత్వం తెలియజేయడం జరిగింది. వక్ఫ్ బోర్టు అంశంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన రుణమాఫీని పూర్తిగా అమలు చేసేంత వరకు ప్రజల తరఫున మా పార్టీ పోరాడుతూ ఉంటుందని ఆయన హెచ్చరించారుఎమ్మెల్యేల అనర్హత అంశంపై ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై ప్రభుత్వం ఉద్దేశమేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

వక్ఫ్ బోర్డు అంశంపై ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షం ముగ్గురి పేర్లు పంపించినప్పటికీ వలసదారుడు అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు.