వేణు స్వామిపై కేసు … నాంపల్లి కోర్టు ఆదేశం

వేణు స్వామిపై కేసు … నాంపల్లి కోర్టు ఆదేశం
వివాదాస్పద జ్యోతిష్యవేత్త వేణు స్వామిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జాతకాల పేరుతో ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు వేణు స్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. 
 
ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.  వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీ జతకాల పేరుతో సోషల్ మీడియాలో కామెంట్స్ వదులుతుంటారు. ఇటీవల కూడా నాగచైతన్య, శోభిత దూలిపాళ్ల నిశ్చితార్థంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. 
 
సమంత, నాగ చైతన్య విడిపోయినట్లుగానే.. శోభిత దూలిపాళ్ల, నాగచైతన్య కూడా విడిపోతారంటూ వేణు స్వామి సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలాడు. గ్రహబలం, పేరుబలం, జాతక బలం అని రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. అయితే, ఈ కామెంట్స్‌పై సినీ ఇండస్ట్రీలోని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పలు ప్రజా సంఘాలు కూడా వేణు స్వామి కామెంట్స్‌పై మండిపడ్డారు. మహిళా కమిషన్ చైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ కేసు వేశారు. ఇక జర్నలిస్ట్ మూర్తి, మరొకరు తనను, తన భార్యను వేధిస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వేణుస్వామి, ఆయన భార్య ఆరోపించారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. తమకు ప్రాణ హాణీ ఉందని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు కూడా పిర్యాదు చేశారు.