
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్ఎస్ఎస్) వ్యవస్థ కలిగిన ప్రైవేటు వాహనాలు ఇకపై జాతీయ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ఛార్జీ లేకుండా ఉచితంగా తిరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు వంతెనలు, బైపాస్ లేదా సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని పేర్కొంది.
ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు, 2008 నింబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న టోల్గేట్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది.
కొత్త విధానంలో టోల్గేట్ దగ్గర ఆగి, ఫీజు చెల్లించాల్సిన పని లేదు. మనం ప్రయాణించిన దూరాన్ని జీపీఎస్ ఆధారంగా లెక్కించి, టోల్ వసూలు చేస్తారు. ఇందుకోసం జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ వ్యవస్థ కలిగి ఉన్న వాహనాల విషయంలో కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం అనుసరిస్తున్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం అమలు కానుంది. కాగా, జిఎన్ఎస్ఎస్ ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన పైలట్ స్టడీని, కర్ణాటకలో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారి ఎన్హెచ్-275పై చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంతకుముందు వెల్లడించారు.
జిఎన్ఎస్ఎస్ ద్వారా టోల్ వసూలు చేయడానికి శాటిలైట్ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తారు. ఈ సాంకేతిక వ్యవస్థ వాహనం కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అనంతరం జిఎన్ఎస్ఎస్ వ్యవస్థతో కూడిన ఆన్ బోర్డు యూనిట్‌లో ఉన్న సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అటోమెటిక్గా టోల్ ఛార్జీని లెక్కిస్తుంది.
ఆ తర్వాత ఫాస్టాగ్/డిజిటల్ వ్యాలెట్ వంటి డ్రైవర్ ప్రీపెయిడ్ అకౌంట్ల నుంచి ఆ టోల్ ఛార్జీ ఆటోమెటిక్గా కట్ అవుతుంది. ఈ సాంకేతికత టోల్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని ద్వారా ట్రాఫిక్ పరిస్థితులు లేదా వివిధ రహదారులను బట్టి టోల్ ఛార్జీలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ పద్ధతి పూర్తిగా అమలైతే మాన్యువల్ టోల్ సేకరణ అవసరం ఉండదు. దానివల్ల జరిగే ఆలస్యాన్ని అధిగమించవచ్చు.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా