
బుడమేరు వరదలు ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అపారనష్టం కలిగించాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి ఉపద్రవం భవిష్యత్తులో జరగకుండా బుడమేరు బుడమేరు సహజ ప్రవాహ మార్గాన్ని కొల్లేరు సరస్సు వరకు సుగమం చెయ్యాలని, ఆక్రమణలను, కబ్జాలను తొలగించాలని, బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదికి 37500 క్యూసెక్ ల ప్రతిపాదిత సామర్ధ్యాన్ని యుద్ధ ప్రతిపాదికన అమలులోకి తీసుకుని రావాలని సాగునీటి నిపుణులు టి. లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
`బుడమేరు నేర్పిన గుణపాఠాలు’ అంశంపై గుంటూరులో జన చైతన్య వేదిక జరిపిన సమావేశంలో ప్రసంగిస్తూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతం 45 శాతం ఉండగా, బుడమేరు 48 శాతంగా ఉందని గుర్తు చేశారు. ఇలాంటి బుడమేరును ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని పేర్కొంటూ వెరగలేరు రెగ్యులేటర్ వద్ద 11 లాకులు ఉంటే నాలుగు పనిచేయడం లేదని, సరైన సిబ్బంది లేరని ఆయన తెలిపారు.
పులిచింతల దిగువ భాగంలో వైకుంఠపురం వద్ద 20 టీఎంసీ ల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మిస్తే మున్నేరు వరద నీటిని నిల్వ చేసుకోగలమని ఆయన చెప్పారు. వైకుంఠపురం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ కుడి కాలువకు నీరు తరలిస్తే గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలంపై బాగాన కృష్ణా నదిపై సిద్దేశ్వరం ఆనకట్టను, కృష్ణా నదిలో కలిసే తుంగభద్ర పై సుంకేసుల ఆనకట్టకు పైభాగాన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ ను నిర్మిస్తే కరువు పీడత ప్రాంతాలైన రాయలసీమకు నీరు అందించగలమని లక్ష్మీనారాయణ వివరించారు.
మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ సహజ సిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేశారు. వైసిపి పాలనలో నీటి పారుదల ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, బడ్జెట్ లో అతి స్వల్ప కేటాయింపులు జరిగాయని విచారం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలు క్రీస్తుపూర్వం నుండి కొనసాగుతున్నాయని, ఎలాంటి ముప్పుకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. నదులకు కూడా జీవం ఉంటుందని చెబుతూ వాటి జీవహక్కులను కాపాడాలని ఆయన తేల్చి చెప్పారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణలో అమలవుతున్న హైడ్రా లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసి నాలాలు, వాగులు, సరస్సులు, నదుల ఆక్రమణలను, కబ్జాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని సూచించారు. రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ ప్రసంగిస్తూ రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతూ విష వలయంగా మారి నాణ్యతకు, ప్రమాణాలకు తిరోగతి కలిగిస్తున్నారని విమర్శించారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ