తెలంగాణాలో రేపే కేంద్ర బృందం పర్యటన

తెలంగాణాలో రేపే కేంద్ర బృందం పర్యటన
తెలంగాణాలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా, వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనుంది.

ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ గారితో ఫోన్లో మాట్లాడి, ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొద్దీ రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పర్యటించారు.  ఏరియల్‌ సర్వే ద్వారా నష్టపోయిన పంటలతో పాటు ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

మున్నేరు, పాలేరు, ఆకేరు, కట్టలేరు వాగులు ఉప్పెనలా ఊర్లను ముంచెత్తిన వైనం చూసి చలించిపోయారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి చౌహాన్‌కు వివరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలని అమాత్యులు విన్నవించగా, రాష్ట్ర ప్రజలను కేంద్రం ఇతోధికంగా ఆదుకుంటుందని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భరోసా ఇచ్చారు.