బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లయితే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ, ఇతరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు గత నెల 7న పూర్తయ్యాయి.
నేడు తీర్పును వెలువరిస్తూ పిటిషన్ల విచారణపై షెడ్యూల్ రిలీజ్ చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. నోటీసులు ఎప్పుడు ఇస్తారు, విచారణ ఎప్పుడు జరుపుతారు, ఎప్పటివరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలనే విషయాలను ప్రకటించాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
గత ఏప్రిల్ 24న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేయగా, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు:
- దానం నాగేందర్ – ఖైరతాబాద్
- ప్రకాష్ గౌడ్ – రాజేంద్రనగర్
- గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్ చెరు
- కాలె యాదయ్య – చేవెళ్ల
- అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి
- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల్
- ఎం సంజయ్ కుమార్ – జగిత్యాల
- పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ
- తెల్లం వెంకట్రావు – భద్రాచలం
- కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్పూర్
More Stories
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్