మున్నేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి

మున్నేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి
తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో శ‌నివారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. మ‌ళ్లీ ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తింది. సాగునీటి జ‌లాశ‌యాల‌న్నీ నిండు కుండ‌లా మారాయి. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చ‌ర్య‌ల‌కు అధికారుల‌ను మంత్రులు ఆదేశించారు.

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో అత్య‌ధికంగా 18.25 సెం.మీ., ఖ‌మ్మం జిల్లా త‌ల్లాడ‌లో 12.15 సెం.మీ., భ‌ద్రాద్రి జిల్లా మ‌ద్దుకూరులో 9.23 సెం.మీ., ఖ‌మ్మం జిల్లా మంచుకొండ‌లో 9 సెం.మీ., ర‌ఘునాథ‌పాలెంలో 8.9 సెం.మీ., మ‌హబూబాబాద్ జిల్లా గార్ల‌లో 8.1 సెం.మీ., భ‌ద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ., వికారాబాద్ జిల్లా ధ‌వ‌లాపూర్‌లో 8 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

ఖ‌మ్మం జిల్లాలోని మున్నేరుకు వ‌ర‌ద ప్ర‌వాహం పెరుగుతోంది. 12.8 అడుగుల వ‌ద్ద మున్నేరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. 16 అడుగుల‌కు చేరగానే తొలి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేయ‌నున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురియ‌డంతో మున్నేరు వ‌ర‌ద పోటెత్తింది. 

వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ముంపు బాధితుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు. ముంపు బాధితుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని చెప్పారు.

వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.

దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచిస్తూ భట్టి విక్రమార్క ఖమ్మం బయలుదేరి వెళ్లారు.

తాజా పరిస్థితులపై జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఐఎండీ సూచనల ప్రకారం  జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇండ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. అత్యవసరమైన పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1077ను సంప్రదించాలని సూచించారు. 

మున్నేరు వాగుకి మ‌రోసారి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారుల అందరిని అప్రమత్తం చేశారు. వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.