జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 పునరుద్ధరణ ప్రసక్తే లేదు

జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 పునరుద్ధరణ ప్రసక్తే లేదు

జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 ఇక చరిత్రలో భాగమని, దానిని తిరిగి పునరుద్దరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రణాలికను శుక్రవారం జమ్మూలో విడుదల చేస్తూ జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్ములిస్తామని ప్రకటించారు.  ఆర్టికల్ 370 రాజ్యాంగంలో భాగం కాదని, ఇక ముందు కూడా కాబోదని స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్‌ను స్వయం ప్రతిపత్రి కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని అమిత్‌షా ప్రశంసించారు. తద్వారా జమ్మూకశ్మీర్‌లో శాంతి, ప్రగతి, సామాజిక న్యాయం సుసాధ్యమైందని చెప్పారు. ఆర్టికల్ 370 కారణంగానే జమ్మూకశ్మీర్ యువకులు హింస వైపు మళ్లారని గుర్తుచేశారు.

అభివృద్ధి, భద్రత, ఆర్థిక వృద్ధి తమ ప్రాధాన్యతాంశాలని మేనిఫెస్టోలో బీజేపీ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సుస్థిరత, ప్రగతికి బీజేపీ కట్టుబడి ఉంటుందని తెలిపింది. జమ్మూకశ్మీర్‌ విషయంలో బీజేపీ చిరకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని మేనిఫెస్టో విడుదల సందర్భంగా అమిత్‌షా ప్రస్తావిస్తూ, బీజేపీకి ఈ ప్రాంతంలో చారిత్రక అనుబంధం ఉందని పేర్కొన్నారు. 

పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ప్రముఖులు చేసిన కృషిని గుర్తుచేశారు. ”స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూకశ్మీర్ అంశం మా పార్టీకి కీలకంగా ఉంది. ఈ ప్రాంతాన్ని భరత్ తో కలిపి ఉంచేందుకు మేము నిరంతరం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాం. కశ్మీర్ భారత అంతర్భాగం. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే కొనసాగుతుంది. కశ్మీర్ అభివృద్ధి భారత్ అభివృద్ధిలో భాగంగా ఉంటుంది. ఇందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉంది” అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ మౌనంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఎజెండాను సమర్ధించిందని విమర్శించారు. మౌనం వల్ల లాభం లేదని, నేషనల్ కాన్ఫరెన్స్ ఎజెండాను అంగీకరిస్తున్నా లేదా అనేది రాహుల్ గాంధీ దేశ ప్రజలు, జమ్మూకశ్మీర్ ప్రజల ముందు వివరణ ఇవ్వాలని అమిత్ షా డిమాండ్ చేశారు.

“నేను ఎన్సీ(నేషనల్ కాన్ఫరెన్స్) పార్టీ ఎజెండా ఏంటో చూశాను. ఎన్సీకి కాంగ్రెస్ మౌనంగా మద్దతు ఇస్తుండటం కూడా చూశాను. కానీ నేను దేశ ప్రజలకు ఒకటే చెప్పదలచుకున్నా. ఇకపై అధికరణ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదు. ఈ ఆర్టికల్ యువత చేతుల్లో ఆయుధాలు, రాళ్లను మాత్రమే ఇచ్చింది. యువత ఉగ్రవాదం వైపు నడిచేలా చేసింది” అంటూ విమర్శలు గుప్పించారు. 

“నేను ఒమర్ అబ్దుల్లాకు ఒకటే చెప్పదలచుకున్నా, ఎన్నికల ఫలితాలు ఏమైనా కానీ, గుజ్జర్లకు ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి ఎవ్వరినీ వెళ్లనివ్వం. గత పదేళ్లలో జమ్ముకశ్మీర్ స్వర్ణ యుగాన్ని చూసింది. శాంతి, అభివృద్ధి, పురోగతి అభివృద్ధికి హామీ ఇచ్చింది. జమ్ముకశ్మీర్లో తీవ్రవాదం ఆవిర్భావానికి బాధ్యులెవరో నిర్ధరించడానికి శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఇక్కడ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం” అని స్పష్టం చేశారు. 

ఈ ప్రాంత అభివృద్ధికి భరోసా ఇచ్చేందుకు తమకు ఐదేళ్ల పదవీ కాలం ఇవ్వాలని జమ్ముకశ్మీర్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కుటుంబ పెద్ద అయిన మహిళలకు ఏటా రూ.18,000 ఇచ్చేందుకు ‘మా సమ్మాన్ యోజన’ అనే పథకం తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల స్కీమ్ కింద ఏటా రెండు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది.

 ‘ప్రగత శిక్షా యోజన’ కింద కాలేజీ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్‌గా ఏటా రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ‘పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా రోజ్‌గార్ యోజన’ కింద జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. మారమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామన వాగ్దానం చేసింది.

వీటితో పాటు జమ్ముకశ్మీర్‌ను టెరరిస్టు హాట్‌స్పాట్‌ నుంచి టూరిస్ట్‌ స్పాట్‌గా మారుస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. హిందూ ఆలయాలను పునర్నిర్మించడం సహా పునరుద్ధరిస్తామని తెలిపింది. భూమి లేనివారికి అటల్ ఆవాస్ యోజన కింద 1361 చదరపు అడుగుల స్థలాన్ని ఉచితంగా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.