మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన లండన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించి మరీ హైదరాబాద్ సిబిఐ కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చినా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశంతో మరో సమస్య ఎదురైంది.
దీంతో జగన్ ఇప్పుడు ఎపి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా విచారణ వాయిదా పడింది. దీంతో పాస్ పోర్ట్ క్లియరెన్స్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ సిఎంగా ఉన్నప్పుడు ఆయనకు నిబంధనల ప్రకారం దౌత్యపరమైన పాస్ పోర్టు లభించింది.
తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయన ఈ డిప్లమేటిక్ పాస్ పోర్టును సరెండర్ చేసి రెగ్యులర్ పాస్ పోర్టు తీసుకున్నారు. ఆయనకు ఐదేళ్ల గడువుతో రెగ్యులర్ పాస్ పోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్‌పై ఉన్న కేసు తలనొప్పిగా మారింది.
దీంతో తనకు ఐదేళ్ల గడువుతో రెగ్యులర్ పాస్ పోర్టు కోరుతూ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఏడాది పాటు మాత్రమే రెగ్యులర్ పాస్ పోర్టు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ జగన్ ఎపి హైకోర్టును ఆశ్రయించారు.
ఐదు సంవత్సరాలకు పాస్ పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో జగన్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో జగన్ తన లండన్ ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి జగన్ లండన్ ప్రయాణం ఆధారపడనుంది.
పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లండన్ టూర్ వెళ్లేందుకు పిటీషనర్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజా ప్రతినిధుల కోర్టు అనేక షరతులను విధించినట్టు పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయటం సరికాదని కోర్టులో జగన్ న్యాయవాది వాదనలు వినిపించారు.
ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. తదుపరి విచారణ సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 3 నుంచి 25వ తేదీ వరకు వైఎస్ జగన్ లండన్‌కు వెళ్లాల్సి ఉంది.

More Stories
ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం శాశ్వత దిక్సూచి
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అనవసర దుష్ప్రచారం
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన