బీజేడీ సస్పెండ్‌ చేయగానే బీజేపీలో చేరిన ఎంపీ

బీజేడీ సస్పెండ్‌ చేయగానే బీజేపీలో చేరిన ఎంపీ
బిజూ జనతాదళ్‌ పార్టీలో బహిష్కరణకు గురైన ఎంపీ సుజీత్‌ కుమార్‌ బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ పనితీరు నచ్చడంతో తాను ఈ పార్టీలో చేరానని చెప్పారు. 
 
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ పరిపాలన నచ్చిందని చెబుతూ ఆయన సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. బీజేపీలో చేరడాన్ని తాను తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 
 
కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో బీజేడీ సుజీత్‌కుమార్‌ను అంతకు ముందు పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేడీ ఒక ప్రకటన విడుదల చేసింది.బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ పేరుతో ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే సుజీత్‌కుమార్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కఢ్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. సుజీత్ రాజీనామాకు ధన్‌కఢ్‌ వెంటనే ఆమోదం తెలిపారు.