భద్రాద్రి జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు కాల్చివేత

భద్రాద్రి జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు కాల్చివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, లచ్చన్న దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి.
 
ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న దళం నీలాద్రి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం తెలియడంతో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టారు. లచ్చన్న దళం సభ్యులు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ఆరుగురు మావోలు మృతి చెందారు.
 
మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
 
ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని భద్రతా బలగాలు వెల్లడించాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే 15 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి.