కేంద్రం అందిస్తున్న వరద సహాయంపై స్పందించని రేవంత్

కేంద్రం అందిస్తున్న వరద సహాయంపై స్పందించని రేవంత్

* కేంద్రం పంపిన రెండు హెలీకాఫ్టర్లను వాడకుండా ఉంచిన రేవంత్

వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆడుకొని సహాయ, సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సామాగ్రితో పాటు 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. ఐతే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కంట్రోల్‌రూంకి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం పంపించకపోవడం పట్ల కేంద్ర హోంశాఖ స్పష్టం అసహనం వ్యక్తం చేసింది. 
 
పైగా, కేంద్రం తెలంగాణకు పంపిన రెండు హెలికాప్టర్లను హకీంపేటలో ఉంచుకొని ఉపయోగించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. విపత్తు సహాయ కార్యక్రమాల గురించి రోజువారీ పంపించాల్సిన నివేదికలు పంపించక పోగా,   రెండు హెలికాప్టర్లను పంపినా ఏం చేస్తున్నారని నిలదీసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ప్రశ్నించింది.
తెలంగాణాలో వరదల గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సమాచారం అందలేదని కేంద్రం స్పష్టం చేసింది. వర్షాలపై ఇటీవల సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి కేంద్రానికి సవివరంగా లేఖ రాయాలని అధికారులను ఆదేశించి రెండురోజులవుతున్నా ఎటువంటి కదలిక లేదు.

రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి రూ.1,345.15 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌ ద్వారా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నిందికింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద అమలు చేసే పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్, అక్టోబరులో సమాచారం అందించాలి. 2024-25కి సంబంధించిన తొలివిడత మొత్తం రూ. 208.40 కోట్లను ఈ ఏడాది జూన్‌ 1న ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు.

అంతకు ముందు విడుదలైన నిధులు, ఆర్జించిన వడ్డీ ఆదాయం, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత విధానంలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలని సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగానికీ పంపాలని కేంద్రం పేర్కొంది. అప్పుడే 2024-25కి సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల్లో కేంద్ర వాటా తొలి విడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్ర సీఎస్‌కి తెలిపింది.

కాగా, రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు త్వరలో పర్యటించి ఏరియల్‌ సర్వే చేస్తాయని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నష్టం వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేరుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు, శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నివేదిక ఆధారంగా కేంద్రం తగిన సాయం అందిస్తుందని వెల్లడించారు.