సీఐఎస్‌ఎఫ్‌కి పూర్తి సహకారాన్ని అందించాలంటూ బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టును కోరింది. ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించని పక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాలని విజ్ఞప్తి చేసింది.
వైద్యురాలిపై హత్యాచారం ఉదంతం తర్వాత ఆర్జీ కర్ ఆసుపత్రిపై ఆందోళన కారులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు అక్కడి నుంచి పారిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, వైద్యులకు రక్షణ కల్పించేందుకు ఆసుపత్రిలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
వైద్యురాలి అత్యాచారం, ఆసుపత్రిపై దాడి ఘటనల నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలంటూ సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వైద్యుల ఆందోళనతో 22 మంది జూనియర్ వైద్యుల బృందం సీపీని కలిసేందుకు అనుమతి ఇచ్చారు. వారితో సీపీ గోయల్‌తో రెండు గంటలపాటు చర్చలు జరిపారు.
సీపీతో సమావేశం అనంతరం వైద్యుల్లో ఒకరు విలేకరులతో మాట్లాడారు. ”ఆగస్టు 9న జరిగిన ఘటనలో పోలీసుల తప్పిదం ఉందని సీపీ అంగీకరించారు. ఆగస్ట్ 14 రాత్రి ఆసుపత్రిపై దాడి చేయడాన్ని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని సీపీ ఒప్పుకున్నారు” అని తెలిపారు. “ఆందోళనలు అడ్డుకోవడంలో సీపీ విఫలమైనందుకు రాజీనామా చేయాని డిమాండ్ చేశాం. ఈ సందర్భంగా తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించినట్లు సీపీ తెలిపారు. తనపై ఎలాంటి చర్యలు చేపట్టాలో పైఅధికారులే నిర్ణయిస్తారని సీపీ చెప్పారు.” అని ఓ జూనియర్ డాక్టర్ తెలిపారు.
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు