విజయవాడలో డ్రోన్లు, హెలికాఫ్టర్లు ద్వారా ఆహార సరఫరా

విజయవాడలో డ్రోన్లు, హెలికాఫ్టర్లు ద్వారా ఆహార సరఫరా
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహారం సరఫరా కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. హెలికాఫ్టర్లు, పడవలు ద్వారా వరద బాధితులకు ఆహారం, పాలు, మందులను సరఫరా చేస్తోంది. అలాగే పడవలు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరాలను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
అనుకున్నదే తడువుగా మంగళవారం ఉదయం విజయవాడలో డ్రోన్ల ద్వారా వరద సహాయాన్ని అందజేస్తోంది సర్కార్. పడవలు చేరుకోలేని వివిధ ప్రాంతాల్లో డ్రోన్‌లు ద్వారా ఫుడ్ పాకెట్లను సరఫరా చేసింది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 16 డ్రోన్లు ద్వారా 10 వేల ఆహార పొట్లాలు సరఫరా అయ్యాయి. ఇంకా డ్రోన్‌ల ద్వారా సరఫరా కొనసాగుతోంది.

వరద ముంపులో ఉండిపోయిన బెజవాడ ప్రజానీకాన్ని కాపాడేందుకు మరికొంత మంది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే కేంద్రం నుంచి 25 పవర్‌ బోట్లు, తొమ్మిది హెలికాప్టర్లతోపాటు వంద మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బెజవాడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనగా.. తాజాగా పూణే నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి.

మంగళవారం ఉదయం పూణే నుంచి ప్రత్యేక విమానంలో నాలుగు హెలికాఫ్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో 120 మంది సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నాయి. వీరంతా ముంపు ప్రాంతాలకు చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యల్లో పాల్గొననున్నారు. ముంపు బాధితులకు ఆహారం, మంచినీటిని సరఫరా చేయనున్నారు.
మరోవైపు వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
‘5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలి. మూడు పూటలా ఆహారం అందించాలి. విజయవాడలో 36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలి. క్షేత్ర స్థాయిలో ఆహారం అందింది లేనిది నిర్ధారించుకోవాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.  ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం అవుతున్న తరుణంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు వివరించింది.