శ్రీవారిని దర్శించుకున్న ప్రతీ భక్తుడికి తగినన్ని లడ్డూలు

శ్రీవారిని దర్శించుకున్న ప్రతీ భక్తుడికి తగినన్ని లడ్డూలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జే శ్యామల రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూతో పాటు తగ్గిన రూ.50 లడ్డూలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.  టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నదని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి, బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందని చెప్పారు.
శ్రీవారిని దర్శించుకోకుండానే లడ్డూలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డుపై రెండు లడ్డూలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒక ఇంట్లో 5 ఆధార్ కార్డులు ఉంటే పది లడ్డూలు కూడా పొందవచ్చని తెలిపారు.
ఆధార్ కార్డు లేకుంటే లడ్డూలు ఇవ్వరని, రెండే ఇస్తున్నారని దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉద్యోగుల డేటా తమ వద్ద ఉందని పేర్కొంటూ వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.
 
అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాల్లోనూ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందని చెప్పారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
 
తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందని చెప్పారు. తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామని తెలిపారు.  ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటి వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా, భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు? దర్శనం చేసుకొని వారు ఎన్ని లడ్డూలు తీసుకొంటున్నారు? తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. 
 
ఇప్పటికే సీవీఎస్‌ఓ, జిల్లా ఎస్పీలతో సంప్రదించి లడ్డూ దళారులను గుర్తించినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. లడ్డూ ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అనేక మార్పులు చేశామని శ్యామలరావు తెలిపారు. అన్న ప్రసాద కాంప్లెక్స్‌లో నాణ్యత పెంపునకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. శ్రీవారి దర్శనంలో భక్తుల నిరీక్షణ సమయాన్ని మూడు గంటలు తగ్గించామని పేర్కొన్నారు. సర్వ దర్శనం టోకెన్లు గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తుండగా ఇప్పుడు 1.60 లక్షలు ఇస్తున్నామని వివరించారు.