భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలో జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు ప్రారంభ సెషన్‌లో ప్రధాని మోదీ పాల్గొంటూ న్యాయవ్యవస్థను రాజ్యాంగాన్ని పరిరక్షుడిగా పరిగణిస్తున్నామని, సుప్రీంకోర్టు, న్యాయవవస్థ తమ బాధ్యతను నిర్వర్తించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు లేదా న్యాయవ్యవస్థపై భారత ప్రజలు ఎప్పుడూ అపనమ్మకం చూపలేదని స్పష్టం చేశారు.
ఇక ఇదే సదస్సులో దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రస్తావించారు. మహిళపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలని చెప్పారు. ‘మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో ఎంత వేగంగా న్యాయం జరుగుతుందో.. అప్పుడే వారి భద్రతపై ఎక్కువ భరోసా ఏర్పడుతుంది. దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇప్పటికే అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలి’ అని సూచించారు.
`2019లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం కింద సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే మహిళలపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయి’ అని ప్రధాని మోదీ తెలిపారు.
‘మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని కాపాడే సంరక్షుడిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా స్వాతంత్య్రం తర్వాత న్యాయం అనే భావనను కాపాడింది. ఎమర్జెన్సీ వంటి చీకటి పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో రాజ్యాంగ రక్షణలో కీలక పాత్ర పోషించింది. ప్రాథమిక హక్కులకు రక్షించింది. వాటితో పాటు జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు సుప్రీం న్యాయస్థానం ఎప్పుడూ జాతీయ సమగ్రతను కాపాడుతూ వచ్చింది’ అంటూ ప్రధాని కొనియాడారు.
ఈ అమృత్‌కాల్ సమయంలో 140కోట్ల మంది దేశ ప్రజలు అభివృద్ధి చెందిన, సరికొత్త భారత్‌ను చూడాలని ఆశిస్తున్నారని చెబుతూ గత పదేళ్లలో కేసుల విచారణలో జాప్యాన్ని తొలగించేందుకు వీలుగా అనేక చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

More Stories
ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలియదనుకుంటా!
తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు