టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులపై కమిటీ వేయాలి

టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులపై కమిటీ వేయాలి
హేమ కమిటీ నివేదికను ప్రముఖ నటి సమంత స్వాగతిస్తూ  చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ (డబ్ల్యుసీసీ) ప్రయత్నాలను ప్రశంసించారు. అదే విధంగా టాలీవుడ్ లో సహితం లైంగిక వేధింపులపై ఓ కమిటీని వేయాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మహిళా నటీమణులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
 
‘తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ రిపోర్ట్‌ను స్వాగతిస్తున్నాం. డబ్ల్యూసీసీని స్ఫూర్తిగా తీసుకొని.. టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనూ 2019లో ‘ది వాయిస్‌ ఆఫ్‌ విమెన్’ ఏర్పాటైంది. టాలీవుడ్‌లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్‌ కమిటీ నివేదికను పబ్లిష్‌ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని సామ్‌ ఇన్‌స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు.
 
కాగా, ఈ రిపోర్ట్‌పై సమంత ఇప్పటికే తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేరళలోని విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ (డబ్లూసీసీ) అద్భుతమైన పనితీరును తాను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నట్లు సమంత తెలిపారు.  డబ్లూసీసీ వల్లే హేమ కమిటీ నివేదిక ఇవ్వగలిగిందని, చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బ‌య‌ట‌కు వ‌చ్చాయన్నారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలని సామ్‌ అభిప్రాయపడ్డారు.
 
 వీటికోసం ఇప్పటికీ ఎంతో మంది పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. అయిననప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదని, కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై త‌గిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్ల్యూసీసీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడించారు.
 
 కాగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.