
విజయనగర్ లేఅవుట్లోని ఖరీదైన ప్రాంతంలో భూమిని కేటాయించాల్సిందిగా ముడాను పార్వతి అడిగారని, ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత దేవనూరు లేదా మరో ప్రాంతంలో స్థలం అడిగినట్టుగా లేఖను మార్చారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు.
ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య కుటుంబం భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ ఆరోపణలను నిరూపించేలా పత్రాలు ఉన్నాయని ‘రిపబ్లిక్’ మీడియా సంస్థ ఓ కథనం ప్రసారం చేసింది. దీని ప్రకారం.. సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి కేసరి అనే గ్రామంలో ముడా 3.16 ఎకరాలు సేకరించింది.
ఈ స్థలాన్ని పార్వతి సోదరుడు మల్లికార్జున ఓ రైతు వద్ద 2004లో కొనుగోలు చేశారని, 2005లో పార్వతికి బహుమతిగా ఇచ్చినట్టు రికార్డులు చెప్తున్నాయి. కాగా, ఈ స్థలం అసలు యజమాని అయిన రైతుకు కేవలం రూ.5.95 లక్షలు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ భూమిని ముడాకు ఇచ్చి ప్రతిగా ఖరీదైన ప్రాంతంలో పార్వతి అందుకున్న స్థలాల విలువ ఇప్పుడు అక్షరాలా రూ.65 కోట్లు.
ఎక్కడ స్థలం కావాలనేది తన భార్య ముడాను కోరలేదని ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే, ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న ఒక లేఖ బయటకు వచ్చింది.
కేసరి గ్రామంలో ఇచ్చిన భూమికి బదులుగా తనకు ఫలానా ప్రాంతాల్లో స్థలాలను కేటాయించాలని కోరుతూ 2014లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముడాకు పార్వతి లేఖ రాశారు. స్థలాలు కావాలని లేఖలో పేర్కొన్నవి ఖరీదైన ప్రాంతాలు. అయితే, లేఖలో పేర్కొన్న ప్రాంతాల పేర్లను తర్వాత వైట్నర్తో తుడిపేశారు.
కాగా, పార్వతికి స్థలాన్ని కేటాయించేందుకు 3,500 స్థలాలు ఉన్నప్పటికీ ఖరీదైన విజయనగర్లోనే ముడా కేటాయించిందనే విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ స్థలాన్ని కేటాయిస్తూ 2020లో నిర్ణయం జరిగిన ముడా సమావేశంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సిద్ధరామయ్యపై ఆరోపణలు బలపడుతున్నాయి.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!