
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం మాజీ నేత చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ తదితరులు హాజరయ్యారు.
కాగా, సొంత పార్టీపై చంపై సోరెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జేఎంఎంకు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ”అధ్యక్ష తరహా పనితీరు, రాజకీయాలు కారణంగా తప్పనిసరై ఎన్నో ఏళ్లుగా సేవలందించిన జేఎంఎంను విడిచిపెట్టాను” అని తెలిపారు.
ఎమ్మెల్యే పదవికి, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ఆయన రాజీనామా చేసారు. ఆ తర్వాత తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. జేఎంఎంను విడిచిపెట్టాల్సి వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని తెలిపారు.
జేఎంఎంను తన కుటుంబ పార్టీగా భావించానని, గత కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. సిద్ధాంతాలకు జేఎంఎం తిలోదకాలు ఇచ్చందని చెప్పడానికి విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొంటూ పార్టీలో ఎవరికీ తమ ఆవేదన చెప్పుకునేందుకు ఒక వేదిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యల కారణంగా మీరు (సిబు సోరెన్) చురుకైన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, మీరే నాకు మార్గదర్శకంగా కొనసాగుతారని ఆ లేఖలో చంపయీ సోరెన్ తెలిపారు. గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాట్లతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి ఈస్ధాయికి చేరుకున్నానని, జార్ఖండ్ అభివృద్ధితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకే తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపై సోరెన్ వెల్లడించారు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో గత ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ జార్ఖాండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల తర్వాత బెయిలుపై హేమంత్ విడుదల కావడంతో చంపయీ సోరెన్ రాజీనామా చేసి తిరిగి హేమంత్‌కు సీఎం పగ్గాలు అప్పగించారు. ఈ అనూహ్య పరిణామం చంపయీ సోరెన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేయగా, ఎట్టకేలకు ఆయన జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!