బాలీవుడ్ నటిని చిత్రహింసలకు గురిచేసిన విజయవాడ పోలీస్

బాలీవుడ్ నటిని చిత్రహింసలకు గురిచేసిన విజయవాడ పోలీస్
రాజకీయ నాయకుల మెప్పుకోసం తమ హోదాను మరిచిపోయి, ఎంతటివారినైనా ముందు వెనుక చూడకుండా అక్రమ కేసులలో ఇరికిస్తూ, వారిని చిత్రహింసలకు గురిచేయడం పోలీసులకు పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అధికార పార్టీ ఎంపీనే అక్రమంగా ఆరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసినా ఎవ్వరిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. 
 
తాజాగా, ప్రభుత్వం పడిపోయే ముందు విజయవాడకు బాలీవుడ్ నటిని ఒకరిని తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురిచేసి, అక్రమంగా కేసు నమోదు చేసి నిర్బంధించిన వైనం వెలుగులోకి వస్తున్నది.  ‘చంద్రబాబునే అరెస్ట్ చేశాం! ఇక మీరెంత! మాతో పెట్టుకుంటే అంతే!’ అంటూ ముంబై నటిని ‘వైసీపీ’ పోలీసులు బెదిరించారు. 
 
ఆమె కాదంబరి జెత్వానీ. ఆమె  వైద్యురాలు కూడా! వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను, ఆమె తల్లిదండ్రులనూ అరెస్టు చేసి నరకం చూపించారు. అంతర్జాతీయ స్మగ్లర్లు, ఉగ్రవాదుల తరహాలో తమను ఏపీ పోలీసులు అరెస్టు చేసి విమానంలో తీసుకొచ్చారని జెత్వానీ కుటుంబ సభ్యులు వాపోయారు. 
 
ఐపీఎస్ విశాల్‌ గున్నీ నేతృత్వంలో జెత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడకు తీసుకొచ్చారు. మూడు రోజులపాటు వారిని ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌ గెస్ట్‌హౌ్‌సలో ఉంచారు. తీవ్రంగా హింసించారు. ఫిబ్రవరి 6వ తేదీన కాదంబరిని రిమాండుకు పంపించారు. 
 
ముంబైలో పారిశ్రామిక వేత్త సజ్జన్‌ జిందాల్‌పై ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోమని వత్తిడి చేశారు. ఆ కేసు ఉపసంహరించుకొంటేనే విజయవాడలో కేసును ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు.  ఆ పారిశ్రామికవేత్త నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్నేహితుడు కావడంతో, అతనిని లైంగిక వేధింపుల కేసు నుండి ఆదుకొనేందుకు విజయవాడ పోలీసులు వీరంగం సృష్టించినట్లు భావిస్తున్నారు. 
 
త్వరలో నేరుగా విజయవాడకు వచ్చి హోంశాఖ మంత్రితోపాటు డీజీపీని కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని జెత్వానీ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలిసింది.  కాదంబరి బుధవారం ముంబైలో ఓ చానల్‌లో మాట్లాడుతూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో తనకు 2015లో పరిచయం ఏర్పడిందని, అదే ఏడాది అతను తనకు పెళ్లి ప్రతిపాదన చేశాడని తెలిపారు. 
 
కానీ… ఆయన నేపథ్యం తెలిసి తాను ఆ ప్రతిపాదన తిరస్కరించానని జెత్వానీ తెలిపారు. ‘‘విద్యాసాగర్‌కు పెళ్లయిన 14 నెలలకే భార్య వదిలేసి వెళ్లి పోయారు. ఆయనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని గుర్తించి అతన్ని దూరం పెట్టాను. అప్పటి నుంచి నగ్న వీడియో కాల్స్‌తో, అసభ్యకర సందేశాలతో నన్ను వేధించసాగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో విద్యాసాగర్‌ నాపై దొంగ కేసు పెట్టాడు’’ అని వాపోయారు.
 
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు. అది కూడా ఓ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను చూపించి ఈ కేసు పెట్టారు. జెత్వాని ముంబైలో ఇప్పుడు నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను 2020లో కొనుగోలు చేశారు. అయితే 2018లో కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్‌ జరిగింది. అగ్రిమెంట్‌ మాత్రమే జరిగిన ఫ్లాట్‌లో ఆమె ఉంటున్నట్టు చూపడం గమనార్హం. 
 
ఆ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేయడం, ఆ మరుసటి రోజే అంటే, ఫిబ్రవరి 3న ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీ ఆధ్వర్యంలో ముంబై వెళ్లి కాదంబరిని, ఆమె కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకొచ్చారు. మూడు రోజులు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌ అతిథిగృహంలో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. కాదంబరిపై భౌతికంగా దాడులు చేశారు. ఫిబ్రవరి 6న ఆమెను, ఆమె తల్లిదండ్రులను రిమాండుకు పంపించారు.
 
ఫోర్జరీ డాక్యుమెంట్‌ ఆధారంగా పెట్టిన దొంగ కేసులో కాదంబరి కుటుంబంపై 10 ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు నమోదు చేయడం గమనార్హం. సుమారు 40 రోజులపాటు వారు జైలులోనే ఉండే పరిస్థితి కల్పించారు. వారికి సంబంధించిన 18 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. అందులో 80 లక్షల రూపాయలు ఉన్నాయి. కాదంబరి తండ్రి మర్చంట్‌ నేవీలో పనిచేయగా, ఆమె తల్లి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేశారు.
 
‘‘మేం నిస్సహాయులుగా మిగిలిపోయాం. కనీసం ప్రాణాలతోనైనా ఉండాలనే ఉద్దేశంతో విజయవాడ పోలీసులు అడిగినట్లుగా తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాం. దీంతో వాళ్లే మార్చి 15న మాకు బెయిలు ఇప్పించారు. ఈ విషయాల గురించి ఎవ్వరితోనూ మాట్లాడకూడదని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడినా, భవిష్యత్తులో కోర్టుకు వెళ్లినా… జీవితాంతం జైల్లోనే మగ్గేలా చేస్తామని మేం సంతకాలు చేసిన తెల్లకాగితాలు చూపిస్తూ హెచ్చరించారు’’  ఆశా జెత్వానీ వాపోయారు.