ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్‌.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. 

ఈ క్రమంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతులను గుర్తించాల్సి ఉన్నదని వెల్లడించారు.

2026 మార్చినాటికి నక్సల్‌ హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 25న ప్రకటించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్‌ ఆపరేషన్స్‌పై జరిగిన సమావేశం అనంతరం మాట్లాడుతూ వామపక్ష తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం వచ్చిందని చెప్పారు. 

మన దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థకు అతి పెద్ద సవాల్‌ నక్సలిజమని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సవాల్‌ను స్వీకరించిందని, ఆయుధాలు పట్టినవారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తేవడానికి ప్రయత్నించిందని చెప్పారు. నక్సలిజం వల్ల గత నాలుగు దశాబ్దాల్లో 17,000 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. నక్సల్‌ నేతలను మట్టుబెట్టామని తెలిపారు.