బలవంతపు మత మార్పిళ్ల నిరోధంపై కఠినంగా వ్యవహరించాలి

బలవంతపు మత మార్పిళ్ల నిరోధంపై కఠినంగా వ్యవహరించాలి

* అర్చకుల వేతనం రూ.15 వేలకు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు మత మార్పిళ్ల నిరోధంపై కఠినంగా వ్యవహరించాలని, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలని ఆలయ అధికారులకు సూచనలు చేశారు. దేవాలయాల్లో భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అపచారాలకు తావు లేకుండా అధ్యాత్మికతకు పెద్ద పీట వేయాలని అధికారులకు సూచించారు.

ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని చెబుతూ భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సిఎం సూచించారు.  మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖపై సమీక్ష నిర్వించిన ముఖ్యమంత్రి అర్చకులకు వేతనం రూ.10 వేలు నుండి రూ 15 వేలకు పెంచాలని  మేనిఫెస్టోలోని మరో హామీ అమలు దిశగా నిర్ణయించారు.
ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వం పై ఏటా 10 కోట్ల రూపాయల భారం పడనుంది. సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అధికారులు హాజరయ్యారు.  దూపదీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి రూ. 32 కోట్ల అదనపు భారం పడనుంది. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం దేవాదాయ, ఫారెస్ట్, టూరిజం శాఖల మంత్రులతో కమిటీ వేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.  ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖపరంగా గుర్తించి నిర్వహించేందుకు చంద్రబాబు నిర్ణయించారు.

దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించనున్నామన్నారు. ఆలయ ఆదాయం రూ. 20 కోట్లు కంటే అధికంగా ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. దీన్ని 17కు పెంచనున్నారు.  ఇలా అన్ని ట్రస్ట్ బోర్డుల్లో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యుల సంఖ్యను పెంచనున్నారు. ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

ఆ మేరకు సభ్యుల సంఖ్యను పెంచి వారికి అవకాశం కల్పించనున్నారు.  దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలను ఏర్పాటు చేయాలని, పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే, సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సీజీఎఫ్, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనులను ప్రతిపాదించిందని చంద్రబాబు గుర్తు చేశారు. వాటిలో కొన్ని పట్టాలెక్కగా కొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రారంభం కాని పనులను నిలిపేసి మరోసారి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

సీజీఎఫ్ క్రింద 243 పనులు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు. వీటిని నిలిపేయాలని సీఎం నిర్దేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే దేవాలయాలు, ఇతర నిర్మాణాలపై చర్చించి అవసరమైతే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభించాలని సూచించారు.

ప్రతి దేవాలయంలో ఆన్​లైన్ విధానం అమలు చేయాలని, అన్ని సర్వీసులు ఆన్​లైన్ ద్వారా అందాలని సీఎం స్పష్టం చేశారు. గుడికి వచ్చే భక్తులు దర్శనం చేసుకుని వెళ్లడమే కాకుండా ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. అవసరమైతే ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలని సీఎం అన్నారు. ధనికులే కాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా బస చేసే పరిస్థితి ఉండాలని నిర్దేశించారు. గతంలో దేవాలయాల్లో జరిగిన పలు ఘటనలపై లోతుగా విచారణ జరపాలని ఆదేశించారు.