
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ (67) తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల 30న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు.
సోమవారం హోంమంత్రి అమిత్ షాను కలిసిన చంపాయ్ సోరెన్ ఇప్పుడు స్వయంగా ధ్రువీకరించారు.
‘ఈ నెల 18న నేను ఢిల్లీకి వచ్చినప్పుడే నా స్థానం ఏమిటో స్పష్టం చేశాను. వాస్తవానికి ముందుగా నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ ప్రజలలో నాకున్న మద్దతు చూసి నిర్ణయం మార్చుకున్నా. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా’ అని చంపాయ్ సోరెన్ చెప్పారు. ఈ నెల 30న మీరు బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తు్న్నాయి, వాస్తవమేనా అన్న మీడియా ప్రశ్నకు చంపాయ్ సోరెన్ అవునని సమాధానం ఇచ్చారు.
1990లో జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోమం చేపట్టిన ఆయన్ను.. జార్ఖండ్ టైగర్‌గా పిలుస్తారు. ఈ ఏడాది చివరలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భూకుంభకోణం కేసులో అరెస్ట్ కావడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్‌ను సీఎంగా నియమించారు.
అయితే గత నెలలో ఆ కేసులో హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చంపాయ్ సోరెన్‌తో రాజీనామా చేయించి సీఎం పదవి చేపట్టారు. దాంతో తన నుంచి అవమానకరంగా సీఎం పదవి లాక్కున్నారని చంపాయ్ సోరెన్ మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో తదనంతర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్‌యూ) అధ్యక్షుడు సుదేశ్ మహతో తెలిపారు. ఈ మేరకు బీజేపీతో పొత్తు కుదిరినట్లు సోమవారం అమిత్‌షాతో సమావేశమైన తర్వాత ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం