
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిలపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150 మంది వారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు.
ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీకార్డులు లాక్కున్నారు ఇంత జరిగాక, విషయం పోలీస్ స్టేషన్‌కు చేరాక కూడా వారిపై వేధింపులు ఆగలేదు. పోలీస్ స్టేషన్‌లోనే ఒకడు జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినా పోలీసులు చోద్యం చూశారు. వారు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు వారిని భద్రంగా వారి ఇళ్ల వద్దకు పంపారు.
ఒకడు వాళ్ల దగ్గర ఉన్న ఫోన్ లాగుతాడు. మరొకడు కెమెరా, చిప్‌లను గుంజుకుంటాడు. ఇంకొందరు వాళ్లను తోసివేయడం.. బైక్‌లపై మరో పదిమంది వాళ్లను రౌండప్ చేయడం. వెకిలి చేష్టలతో కొందరు ఆ మహిళలను వేధించడం. యువకులు లాక్కున్న మైకులు, ఫోన్ కోసం మహిళలు ప్రయత్నిస్తే ఒకడి చేతిలో నుంచి ఒకడి చేతిలోకి విసిరేసుకోవడం. దీంతో వారు అటూ.. ఇటూ ఫోన్, కెమెరాల కోసం పరిగెత్తడం. చివరకు బైక్‌లపై ఉన్న యువకులు ఆ మహిళలను బురదలోకి నెట్టడం..’ ఇదంతా ఏదో సినిమాలో జరిగిన సంఘటన కాదు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో జరిగిందీ ఘటన.
డీజీపీ జితేందర్‌ను మహిళా జర్నలిస్టులు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో కలిశారు. నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్ ల(పై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందేశారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో మహిళా జర్నలిస్టులపై దాడి జరిగి, వారిపై హత్యాయత్నం జరిగితే రాష్ట్ర మహిళా కమిషన్ గురువారం నాడు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది.
మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం నాడు కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూలు ఎస్పీకి మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని సూచించారు.
More Stories
రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు