కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాన్యులే కాదు.. మనం ఎన్నుకుని చట్టసభలకు పంపించిన అనేక మంది ప్రజాప్రతినిధులపై కూడా లైంగిక ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాల కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ సదరు ప్రజాప్రతినిధులపై సర్వే నిర్వహించింది.
2019 – 24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బరిలో నిలిచిన అభ్యర్థులకు చెందిన 4,809 అఫిడవిట్‌లలో 4,693 మంది వివరాల్ని ఏడీఆర్ పరిశీలించింది. ఇందులో151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల అఫిడవిట్‌లలో మహిళలపై నేరాలకు సంబంధించి తమపై ఉన్న కేసులను వెల్లడించారు.
కోల్‌కతా కేసుతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చల్లో నిలిచింది. ప్రజాప్రతినిధుల అఫిడవిట్ల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధిక శాసనసభ్యులు నేరారోపణలు (మహిళలపై) ఎదుర్కోవడం సంచలనం సృష్టిస్తోంది. 151లో 16 మంది ఎంపీలు, 135 మంది పలు రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులుగా ఉన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిలో 25 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
దేశవ్యాప్తంగా 151 మంది చట్టసభ్యుల్లో 16 మందిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నట్లు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్కు చెందిన చెరో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. వీరిలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేరం రుజువైతే వీరికి 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. కొందరిపై పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం.
బెంగాల్కు చెందిన 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందులో ఉన్నారని తెలిపింది. 21 మంది చట్టసభ్యులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నివేదికలో పేర్కొంది. ఒడిశాకు చెందిన వారు 17 మంది ఉన్నట్లు చెప్పింది. అత్యధికంగా 54 మంది బీజేపీ నేతలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటుండగా, 24 మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఏడీఆర్ కోరింది. సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. నేరస్థులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని ఏడీఆర్ పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని ఏడీఆర్ సూచించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను ఎన్నుకోవద్దని ఓటర్లను కోరింది.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!