
పారిస్ ఒలింపిక్స్ 2024 లో మహిళల రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న కారణంగా పతకానికి దూరమైన వినేశ్ ఫొగాట్ పట్ల దేశం మొత్తం సానుభూతి వ్యక్తం చేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని నెటిజన్ల వరకు అంతా వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలిచారు. ఆమె స్వదేశానికి తిరిగి వచ్చిన్నప్పడు పతాకాలు గెలుచుకొచ్చిన వారికన్నా ఎక్కువగా ఘనంగా స్వాగత సత్కారాలు లభించాయి.
అయితే ప్రస్తుతం జరుగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. పైగా, ఆమె తన పెద్దనాన్న కుమార్తె అయిన బబిత ఫొగాట్‌పైనే బరిలోకి దిగేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. వినేశ్ ఫొగాట్ రాజకీయ అరంగేంట్రం గురించి ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.
అయితే తాను రాజకీయాల్లోకి రాబోనని గతంలోనే వినేశ్ ఫొగాట్ ప్రకటించింది. దానితో ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వినేశ్ ఫొగాట్ ఏ పార్టీలో చేరతారు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇక మరో రెజ్లర్ బజ్‌రంగ్ పునియా కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని ఆ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇటీవల వినేశ్ ఫొగాట్ స్వదేశానికి చేరుకున్న సమయంలో ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెను సాదరంగా స్వాగతం పలికారు. ఊరేగింపులో కూడా పాల్గొన్నారు. గతంలోనూ దీపిందర్ హుడా వినేశ్‌ను రాజ్యసభకు పంపాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గతంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2019లో వినేశ్ ఫొగాట్ సోదరి బబితా ఫొగాట్ బీజేపీలో చేరి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాద్రి స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే దాద్రి నియోజకవర్గం నుంచి బబితా ఫొగాట్ పోటీ చేయడం ఖరారైతే.. ఆమె పైనే వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్ సోదరీమణులు తలపడే అవకాశాలున్నాయి. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు