కేంద్ర బలగాల భద్రతా వలయంలో ఆర్‌జీ కార్‌ ఆసుపత్రి

కేంద్ర బలగాల భద్రతా వలయంలో ఆర్‌జీ కార్‌ ఆసుపత్రి
 
*మాజీ ప్రిన్సిపల్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌!
 
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర బలగాలు మెడికల్‌ కళాశాల, ఆసుపత్రిని సందర్శించారు.

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌  బృందం బుధవారం ఉదయం మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి వద్దకు చేరుకొని అక్కడి భద్రతా ఏర్పాట్లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులు, ఆసుపత్రి వర్గాలను ఆరా తీసింది. ఈ సందర్భంగా సీనియర్‌ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ప్రతాప్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ‘మాకు కేటాయించిన పని నిమిత్తం ఇక్కడికి వచ్చాం. మా పని మమ్మల్ని పూర్తి చేసుకోనివ్వండి. దీనిపై ఉన్నతాధికారులు మీకు తెలియజేస్తారు’ అని తెలిపారు.

భద్రతా ఏర్పాట్లపై ఆస్పత్రి వర్గాలు, స్థానిక పోలీసులతో బుధవారం చర్చించింది. అనంతరం ఆస్పత్రిలో రెక్కీ నిర్వహించింది. ఆగస్టు 15 అర్ధరాత్రి ఆస్పత్రి ఆవరణలో దుండగలు దాడి చేస్తున్నా పోలీసులు నివారించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఘటన తర్వాత చాలామంది వైద్యులు క్యాంపస్‌ను విడిచివెళ్లిపోయారని, అక్కడ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

దవాఖానపై జరిగిన మూకదాడి, ఘటనాస్థలి నుంచి పోలీసులు పారిపోయారన్న ఆరోపణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. క్రైమ్‌ సీన్‌ ఉన్న దవాఖానపై దాడి, విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది. వైద్యులు విధుల్లోకి తిరిగి వెళ్లేలా దవాఖాన వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు బుధవారం  ఆర్‌జీకార్‌ కళాశాల, ఆసుపత్రి భద్రతను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

కేంద్ర బలగాలు ఆసుపత్రి వద్ద రక్షణ కల్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే  సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు ఆర్జీ కార్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి. అటు ఆగస్టు 15న ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించిన వ్యవహారంలో కోల్‌కతా పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. 

ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసింది. హత్యాచారానికి వ్యతిరేకంగా వైద్యులు, మహిళలు నిరసన తెలుపుతుంటే ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్‌ స్టేషన్, మందుల దుకాణం, ఔట్‌ పేషంట్‌ విభాగాలతోపాటు సీసీటీవీలను ధ్వంసం చేశారు.

మరోవైపు, వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని ఆస్పత్రి యాజమాన్యం ఆత్మహత్యగా పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ సందీప్‌ ఘోష్‌ రాజీనామా చేశారు. ఈ కేసులో ఆయన కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీబీఐ పలుమార్లు ఆయనను ప్రశ్నించింది. 

అయితే విచారణ సందర్భంగా సందీప్‌ ఘోష్‌ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రౌండ్‌, రౌండ్‌కు తన జవాబులను మార్చి చెప్పినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. “ఆయన చెప్పిన సమాధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. అందువల్ల ఆయనకు పాలిగ్రాఫ్‌ పరీక్షను నిర్వహించే అవకాశాలపై మేం ఆలోచన చేస్తున్నాం” అని సీబీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఘోష్‌ బుధవారం కూడా దర్యాప్తు సంస్థ ఎదుట హాజరయ్యారు.