బెంగాల్‌ మహిళలకు సురిక్షతమైన ప్రదేశం కాదు

బెంగాల్‌ మహిళలకు సురిక్షతమైన ప్రదేశం కాదు
 
* పోలీస్ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన టిఎంసి ఎంపీ
 
పశ్చిమ బెంగాల్‌ మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం మహిళలు భయపడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. 
 
ఆర్‌జీ ఖర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి ఘటనపై ఆయన స్పందించారు. బాధితురాలి తల్లి మనోభావాలను తాను గౌరవిస్తానని చెప్పారు. రక్షా బంధన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో మహిళా నేతలు, వైద్యులతో గవర్నర్‌ సమావేశమయ్యారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని, ఇది ఇకపై కొనసాగదని స్పష్టం చేశారు. మన ఆడబిడ్డలను, సోదరీమణులను కాపాడుకుంటామని ప్రమాణం చేయాలని కోరారు. మహిళలు సంతోషంగా, సురక్షితమని భావించే సమాజం ఉండాలని చెప్పారు.

మరోవంక, పోలీస్‌ సమన్లకు వ్యతిరేకంగా హైకోర్టును టీఎంసీ ఎంపీ ఆశ్రయించారు. పోలీసుల నోటీసులు చట్టవిరుద్ధమని విమర్శించారు. తనను బెదిరించేందుకు పోలీసులు సమన్లు జారీ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఆగస్ట్‌ 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్‌ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. 

ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రే సొంత పార్టీ, ప్రభుత్వంపై గళమెత్తారు. సీబీఐ న్యాయంగా వ్యవహరించాలని కోరారు. సూసైడ్‌ స్టోరీ చెప్పిన కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ కమిషనర్‌ను కస్టడీలో తీసుకుని ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. హాల్ గోడను ఎందుకు కూల్చివేశారు?, హత్యాచారం జరిగిన 3 రోజుల తర్వాత స్నిఫర్ డాగ్‌ను ఎందుకు ఉపయోగించారు? వంటి ప్రశ్నలు సంధించారు.

కాగా, స్నిఫర్ డాగ్‌ గురించి అవాస్తవాలు ప్రచారం చేసినందుకుగాను టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రేకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టును ఆశ్రయించినట్లు సోమవారం ఆయన తెలిపారు. తన పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని మీడియాతో చెప్పారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంపీ సుఖేందు శేఖర్‌ను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ నాయకుడు షాజాద్‌ పూనావాలా బెంగాల్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ ఎప్పుడు రాజీనామా చేస్తారన్న ప్రశ్న నేడు తలెత్తుతున్నదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎవరు గళం విప్పినా మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి నోటీసులు పంపి బెదిరించడం చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైద్యులను పిలుస్తున్నారని, తమ నేతలు సైతం స్వరం పెంచినా వారిని కూడా పిలుస్తున్నారని చెప్పారు. 
 
ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ సైతం ఈ ఘటనపై విచారణకు డిమాండ్‌ చేస్తే.. కోల్‌కతా పోలీసులు జమన్లు జారీ చేశారని గుర్తు చేశారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రభుత్వం సంస్థాగత, వ్యవస్థాగత విధానాన్ని అవలంభించిందని చెప్పారు. ఈ విషయంపై బెంగాల్‌ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిందని.. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంపై దృష్టి సారించిందని తెలిపారు. మమతా బెనర్జీకి సీఎంగా కొనసాగే హక్కులేదని విమర్శించారు.