పోలవరం ఎడమ కాలువ భూసేకరణ పత్రాలు దగ్ధం!

పోలవరం ఎడమ కాలువ భూసేకరణ పత్రాలు దగ్ధం!
అధికారం కోల్పోగానే కీలకమైన దస్త్రాలను మంటలపాలు కావించడం రివాజుగా మారింది.  ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ సంబంధించి లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే కార్యాలయంలోని అధికారులే దస్త్రాలు కాల్చేశారని అనుమానం కలుగుతోంది.
 
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి దస్త్రాలు తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. కాల్చివేసిన దస్త్రాలను ఇన్‌ఛార్జ్‌ సబ్ కలెక్టర్ శివ జ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. సగం కాలిపోయిన దస్త్రాలను స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారం సంబంధించిన దస్రాలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
 
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే శుక్రవారం రాత్రి కార్యాలయం సిబ్బంది దస్త్రాలు తగులబెట్టేశారని తెలుస్తోంది. ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? అనే అంశాలపై అధికారుల బృందం ఆరా తీస్తోంది. దస్త్రాల దగ్ధంపై విచారణ చేస్తున్నట్లు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వేదవల్లి తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ రెండ్రోజుల క్రితం లీవ్‌పై వెళ్లారని తనను ఇన్‌ఛార్జ్‌గా నియమించగా, తనకు తెలియకుండా స్వీపర్ దస్త్రాలను కాల్చేశారని చెబుతున్నారు.

వైఎస్సార్సీపీ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్ర్తాలు దగ్ధం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. దీనికి బాధ్యలెవరో దర్యాప్తు ఎంత పెద్దవారైనా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

 
పోలవరం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి మీదుగా విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్లడానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 212 కిలోమీటర్ల మేర ఎడమ ప్రధాన కాలువను నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వరకూ భూసేకరణ జరిగింది. దానికి సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు సంబంధించిన ఫైళ్లు, ఎవరి భూమిని ఎంతకు, ఎపుడు సేకరించామనే ఫైళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. 
 
గతంలో స్పెషల్‌ కలెక్టర్‌గా పనిచేసిన వి.మురళి దేవీపట్నం తదితర ప్రాంతాల్లో లబ్ధిదార్లకు దక్కకుండా రూ.19 కోట్లు కాజేశారు. ఆ తర్వాత 22మంది నకిలీ రైతులను సృష్టించి రూ.6 కోట్లు కాజేసిన గొడవలు, కేసులు కూడా ఉన్నాయి. రూ.6 కోట్ల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమైనా ప్రణాళిక ప్రకారమే నిప్పుపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 అయితే, పోలవరం ఎడమ కాలవ సంబంధిత దస్త్రాలు దహనం కాలేదని ఆర్డీవో శివజ్యోతి తెలిపారు. జిరాక్స్ పేపర్లు, సంతకాలు లేనివి మాత్రమే దహనం చేశారని, అనుమతి లేకుండా ఎందుకు దహనం చేశారో విచారణ చేస్తామని వెల్లడించారు. ఇన్‌స్టిట్యూషన్ హెడ్‌ సంతకాలు లేవు కనుక అంత ముఖ్యమైనవి కావని అనుకుంటున్నామని పేర్కొన్నారు.