పోలవరం, అమరావతిలకు సత్వరమే నిధులు

పోలవరం, అమరావతిలకు సత్వరమే నిధులు
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సత్వరమే నిధులు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రధానమంత్రి నివాసంలో శనివారం జరిగిన భేటీలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పలు రాజకీయ, ఆర్థిక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. 
 
అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘పోలవరం’ నిధులను కూడా వెంటనే విడుదల చేస్తే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి వీలవుతుందని తెలిపారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేసిన రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని కోరారు. అలాగే కొత్తగా రుణాలు చేయడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. బడ్జెట్‌ సవరించిన అంచనాల్లో ఎపికి కేటాయింపులు పెంచాలని కోరారు.
ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాసవర్మ, టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. 
 
ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లిన ఆర్థిక అంశాలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు.  వివిధ మూలధన ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రత్యేకసాయం అవసరమని చంద్రబాబు గుర్తు చేశారు తర్వాత కేంద్ర ఉక్కుమంత్రి జేడీ కుమారస్వామితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 
 
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, అభివృద్ధిలో ఏపీని ఉన్నతస్థానానికి చేర్చడంపై చంద్రబాబు తనతో విలువైన అభిప్రాయాలను పంచుకున్నారని నడ్డా ఎక్స్‌ వేదికగా తెలిపారు. వికసిత్‌ ఆంధ్రా లక్ష్యంగా తమ మధ్య చర్చలు జరిగాయని తెలిపారు.
 
అంతకు ముందు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె రామ్మోహన్‌నాయుడును ఆయన కార్యాలయంలో సిఎం చంద్రబాబు కలిశారు. దాదాపు రెండు గంటల సేపు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఎయిర్‌ పోర్టుల నిర్మాణం గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
 
 ‘కుప్పం, దగదర్తి (నెల్లూరు), నాగార్జున సాగర్‌, తునిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఉన్నట్లు చెప్పారు. చిన్న విమానాశ్రయాల కనెక్టివిటీ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉడాన్‌ పథకాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. సీ -ప్లేన్‌ పాలసీ ప్రకారం ప్రకాశం బ్యారేజ్‌ బ్యాక్‌ వాటర్‌లో వాటర్‌ ఏరో డ్రోమ్‌ ఏర్పాటు గురించి చర్చించినట్లు తెలిపారు. 
 
నాగార్జునసాగర్‌తోపాటు కోస్తా తీరంలో చాలా చోట్ల సీ-ప్లేన్‌ సామర్ధ్యాన్ని పెంపొందిస్తామని చెప్పారు. విజయవాడ విమానాశ్రయానికి ముంబాయి నుంచి రెండు, ఢిల్లీ నుంచి ఒకటి, బెంగళూరు నుంచి ఒకటి, విశాఖపట్నం నుంచి ఒక సర్వీసును త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు.