తీవ్రమైన ముప్పుగా ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం

తీవ్రమైన ముప్పుగా ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం
 
* బంగ్లాలో నిష్పాక్షిక ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తాం.. యూనస్ 
ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం సమాజాలకు తీవ్రమైన ముప్పుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.  భారత్ వర్చువల్‌గా నిర్వహించిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ మూడో ఎడిషన్‌లో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ ఆహార, ఇంధన భద్రత సంక్షోభాలు, ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడంలో ఐక్యంగా పనిచేయాలని గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 
 
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ గ్లోబల్ సౌత్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-డిఐపిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సోషల్ ఇంపాక్ట్ ఫండ్‌కు భారత్ 25 మిలియన్ డాలర్లు తొలి విరాళం అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. పరస్పర వాణిజ్యం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత్ నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
 
‘అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌ సమ్మిట్‌ వేదికగా మారింది’ అని చెప్పారు. ప్రపంచ అనిశ్చితి పర్యవసానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపుతున్నాయని, ముఖ్యంగా ఆహారం, ఇంధన భద్రత రంగాలపై తీవ్రమైన ప్రభావం పడుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
 
‘చుట్టూ అనిశ్చితి వాతావరణం ఉన్న సమయంలో ఈరోజు మనం కలుస్తున్నాం. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదు. మరోవైపు యుద్ధ పరిస్థితి మన అభివృద్ధి ప్రయాణానికి సవాళ్లను సృష్టించింది. మనం వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్లు మాత్రమే ఎదుర్కోవడం లేదు. ఇప్పుడు ఆరోగ్య, ఆహార, ఇంధన భద్రత గురించి కూడా మనకు సవాళ్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆందోళనలు మనకు ఉన్నాయి’ అని ప్రధాని తెలిపారు. 
 
గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం తీవ్రమైన ముప్పుగా ఉన్నాయని ప్రధాని హెచ్చరించారు. అయితే,   ఐక్యతలోనే బలం ఉందని చెబుతూ ఈ ఐక్యతే గ్లోబల్‌ సౌత్‌ దేశాలు కొత్త దిశలో పయనించడానికి సహాయపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ విభజన వల్ల సాంకేతికతకు సంబంధించిన కొత్త ఆర్థిక, సాజిక సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
గ్లోబల్‌ గవర్నెన్స్‌తో వ్యవహరించడానికి గత శతాబ్దంలో ఏర్పడిన సంస్థలు ప్రస్తుత శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనలేక పోయాయని ప్రధాని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో భారతదేశం నైపుణ్యం, అనుభవాలను గ్లోబల్‌ సౌత్‌లో పంచుకోవడానికి మోదీ  సుముఖత వ్యక్తం చేశారు.

కాగా, బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్వహించే వాతావరణాన్ని సృష్టిస్తామని అంతర్జాతీయ సమాజానికి ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్‌ యూనస్‌ ఖాన్‌ హామీఇచ్చారు. సమ్మిళిత బహుతత్వ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

భారత్‌ నిర్వహించిన గ్లోబల్‌సౌత్‌ సమ్మిట్‌కు వర్చువల్‌గా పాల్గొంటూ బంగ్లాదేశ్‌లో న్యాయ, ఎన్నికలు, స్థానిక యంత్రాంగం, ఆర్థిక, మీడియా, విద్యావ్యవస్థల్లో కీలకమైన సంస్కరణలను చేపట్టడం తమ తక్షణ కర్తవ్యమని యూనస్‌ఖాన్‌ చెప్పారు. దేశ సంపదను కొన్ని వర్గాలే కాకుండా ప్రజలంతా పంచుకునేలా ఆర్థిక వ్యవస్థను పునఃరూపకల్పన చేయాలని వివరించారు.

1952లో బెంగ్లాలో బెంగాలీ భాషా ఉద్యమం అనే తొలి విప్లవం జరిగిందనీ, ఏడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు రెండో విప్లవం చోటుచేసుకుందని వివరించారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా ఇప్పుడు ప్రపంచ గ్రాఫిటీ రాజధానిగా మారిందన్న ఆయన ప్రజాస్వామ్యమనే నినాదాలతో ఢాకా గోడలు నిండిపోయాయని చెప్పారు. బంగ్లాదేశ్‌ యువత, విద్యార్థులు అందరూ కొత్త శకానికి నాంది పలకాలని కోరుకుంటున్నారని వివరించారు.