
జమ్మూకశ్మీర్ లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. హర్యానాలో అక్టోబర్ 1న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రజల్లో ఎంతో ఉత్సాహం ఉందని, వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారని కుమార్ చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
‘‘లోక్ సభ ఎన్నికల సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లోని పోలింగ్ బూత్ ల వద్ద పొడవైన క్యూలు ప్రజలు మార్పును కోరుకోవడమే కాకుండా ఆ మార్పులో భాగస్వాములు కావడం ద్వారా తమ గళాన్ని వినిపించాలనుకుంటున్నారనడానికి నిదర్శనం. ప్రజలు ప్రస్తుత పరిస్థితిని మార్చాలని కోరుకుంటున్నారు. తమ భవితవ్యాన్ని తామే రాసుకోవాలనుకుంటారు’’ అని తెలిపారు.
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అధికారాల పరిధిని పోలీసు, పబ్లిక్ ఆర్డర్ నుంచి పోస్టింగ్ లు, ప్రాసిక్యూషన్ వరకు కేంద్ర ప్రభుత్వం విస్తృతం చేసిన నెల రోజుల తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు, అధికారులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పరిపాలనలో భారీ పునర్వ్యవస్థీకరణకు ఆదేశించారు.
జమ్ముకశ్మీర్ లో ఎన్నికల షెడ్యూల్ ను నిర్ణయించే ప్రక్రియను ఈసీఐ ప్రారంభించిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్ ఎస్ సంధు పార్టీలకు అతీతంగా అక్కడి నేతలతో చర్చలు జరిపారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి సమన్యాయం జరిగేలా చూడాలని వివిధ పార్టీల ప్రతినిధులు ఈసీని కోరారు.
జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు. ‘జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 74 జనరల్, ఎస్సీ-7, ఎస్టీ-9. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 87.09 లక్షల మంది (జులై 25 నాటికి) ఓటర్లు ఉంటారు. ఇందులో 44.46 లక్షల మంది పురుషులు కాగా, 42.62 లక్షల మంది మహిళా ఓటర్లు. ఇక 3.71 లక్షల మంది మొదటి సారి ఓటర్లు, 20.7 లక్షల మంది యువ ఓటర్లు’ అని రాజీవ్ కుమార్ వివరించారు. ఓటర్ల తుది జాబితాను 19న అమర్‌నాథ్ యాత్ర ముగిన తర్వాత ఆగస్టు 20న ప్రకటించనున్నట్లు తెలిపారు.
2018 జూన్ లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుండి జమ్మూ కాశ్మీర్లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ముందు ఈ ప్రాంతం గవర్నర్ పాలనలో ఉంది. ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ 30 నాటికి 90 మంది సభ్యులున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐని ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు