ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగంతో మోదీ రికార్డు

ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగంతో మోదీ రికార్డు
దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను మోదీ ఎగురవేశారు. 
 
అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తద్వారా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు.
 
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఇవాళ ఉదయం మోదీ 98 నిమిషాల పాటు జాతినుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతకు ముందు 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇప్పటి వరకూ అదే సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. తాజాగా ఆ రికార్డును మోదీ అధిగమించారు. ఇక మోదీ ప్రసంగాల్లో 2017దే అతి చిన్నది. ఆ ఏడాది కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. 
 
1947లో జవహర్‌లాల్ నెహ్రూ, 1997లో ఐకే గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ కూడా 1954 , 1966లో వరుసగా 14 నిమిషాల పాటు అతి తక్కువ ప్రసంగాలు చేశారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుంచి అతి తక్కువ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు. 
 
2012, 2013లో మన్మోహన్ సింగ్ ప్రసంగాలు వరుసగా 32, 35 నిమిషాలు మాత్రమే సాగాయి. 2002, 2003లో వాజ్‌పేయి ప్రసంగాలు 25, 30 నిమిషాల కంటే తక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.
 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అరుదైన ఘనత సాధించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా తెల్లని కుర్తా ధరించి ఒలింపిక్‌ పతక విజేతలతో కలిసి కూర్చుని అందరి దృష్టిని ఆకర్షించారు. గత కొన్నేళ్లుగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసరమైన స్థానాలు ఏ రాజకీయ పార్టీ సాధించలేదకపోయింది. దీంతో 2014 నుంచి 2024 వరకూ ఈ పోస్టు ఖాళీగానే ఉంది.