బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్ నుంచి నదీజలాల వివాదం తప్పించాలి

బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్ నుంచి నదీజలాల వివాదం తప్పించాలి

నదీ జలాల సమస్యలు పరిష్కారం కావాలంటే బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్  నుంచి ఆ అంశాన్ని తప్పించాలని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  స్పష్టం చేశారు. న్యాయ సూత్రాలకు, నీటి సూత్రాలకు విరుద్ధంగా ట్రైబ్యునల్ ఉందని చెబుతూ ఈ ట్రైబ్యునల్ కారణంగా ఏపీతో పాటుగా తెలంగాణ కూడా నష్టమేనని తెలిపారు. బ్రిజేష్ కుమార్‌ను ట్రైబ్యునల్ నుంచి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్న నల్లారి పోలవరం పూర్తి అయితే సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తయితే సీమకు సాగునీరు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరగాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. వీలైనంత త్వరగా రాజధానిని నిర్మిస్తే రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని చెప్పారు. 

సమర్థుడైన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మరోసారి సీఎం కావడం సంతోషంగా ఉందన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.   ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతుని చెబుతూ గత ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పారు. 

సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు కూడా ఐదేళ్ల పాలన కష్టంతో కూడుకున్న పని అని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు సరిగా లేవని,  రెవెన్యూ శాఖను అస్తవ్యస్తంగా చేశారని గుర్తుచేశారు. ఆ రెండు కీలక అంశాలను సరిచేసేందుకు సమయం పడుతుందని చెప్పారు. నెలల్లో సరిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

కాగా, వైసీపీ ప్రభుత్వంలో చేసిన జిల్లాల విభజన కారణంగా పాత జిల్లాలు అస్థిత్వం కోల్పోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. జిల్లాలను విభజించి జగన్ మోహన్ రెడ్డి తప్పుచేశారని చెబుతూ తాను ముఖ్యమంత్రిగా ఉంటే జిల్లాలను మళ్లీ కలిపేసేవాడిని అని చెప్పుకొచ్చారు.

.