షేక్ హసీనాపై హత్య కేసు నమోదు

షేక్ హసీనాపై హత్య కేసు నమోదు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై మొదలైన రగడ ఇంకా కొనసాగుతోంది. ఆ దేశంలో తాత్కాలిక ప్రధానిని ఎన్నుకున్నా ఆందోళన కారులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. ప్రధాని పదవిని వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనాపై హత్య కేసు నమోదైంది. 

ఆమెతో పాటుగా మరో ఆరుగురిపైన కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రిజర్వేషన్ల అంశంపై మొదలైన అల్లర్లతో బంగ్లాదేశ్‌ను నిప్పుల కుంపటిలా తయారైంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కూడా వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 550కి పైగా చేరుకుంది. 

ఈ క్రమంలో గత జూలై 19న మొహమ్మద్‌పుర్‌లోని జరిగిన అల్లర్లలో అబుసయ్యద్‌ అనే ఓ కిరాణ దుకాణ యజమాని మరణించాడు. అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్‌ హసీనానే కారణమని ఆరోపిస్తూ సయ్యద్‌ కుటుంబ సభ్యుల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపైన కూడా కేసు నమోదైంది. 

నిందితుల్లో అవామీ లీగ్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ఒబైదుల్‌ క్వాడర్‌, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ కమల్‌, మాజీ ఐజీ అబ్దుల్లా అల్‌ మామున్‌ సహా మరికొందరు పేర్లు ఉన్నాయి. కాగా, రిజర్వేషన్లకు రద్దుచేసి ప్రతిభకు పట్టం కట్టాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల బంగ్లాదేశ్‌ అగ్నిగుండంలా తయారైంది. 

దీంతో అవామీ లీగ్‌ నేతృత్వంలోనే ప్రభుత్వం కూలిపోయింది. అల్లర్ల నేపథ్యంలో షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాలో సైన్యం సహాయంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.  షేక్‌ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నంత మాత్రాన ఆదేశంతో తమ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినవని బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ ప్రమాణస్వీకారం చేశారు.