బాంగ్లాదేశ్ లో దేవాలయాలపై దాడుల గురించి హాట్‌లైన్‌

బాంగ్లాదేశ్ లో దేవాలయాలపై దాడుల గురించి హాట్‌లైన్‌
ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పెట్టిన తర్వాత తర్వాత హిందువులు, ఇతర మైనారిటీలకు చెందిన వ్యాపారాలు, ఆస్తులు, దేవాలయాలను ధ్వంసం చేస్తుండటంపై ఆందోళనలు వ్యక్తం అవుతూ ఉండడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందూ దేవాలయాలు, చర్చిలు లేదా ఏదైనా ఇతర మత సంస్థలపై దాడుల గురించి సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరుతూ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
 
మతపరమైన సంస్థలపై దాడులకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది.  “దేవాలయం, చర్చి, పగోడా లేదా మరేదైనా మతపరమైన సంస్థపై దుండగులు దాడి చేస్తే, ఈ మొబైల్ నంబర్‌కు 01766-843809కి కాల్ చేయడం ద్వారా లేదా చిన్న సందేశం పంపడం ద్వారా దాని సమాచారాన్ని తెలియజేయాలని అభ్యర్థించారు” అని జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉటంకిస్తూ ఓ దినపత్రిక వెల్లడించింది. 
 
మైనారిటీలకు చెందిన మత సంస్థలపై ఇటీవల జరిగిన దాడులను తాత్కాలిక ప్రభుత్వ మత వ్యవహారాల సలహాదారు ఏఎఫ్ఎం  ఖలీద్ హుస్సేన్ ఖండించారు.  మైనారిటీ గృహాలు, మతపరమైన ప్రదేశాలపై దాడులపై ఫిర్యాదులు అందినట్లు ఖలీద్ ధృవీకరించారు. ఈ సంఘాలకు నిరంతర మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్లు నష్టపరిహారం జాబితాను రూపొందిస్తున్నట్లు హొస్సేన్ ప్రకటించారు.
 
మంగళవారం, తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ఆందోళనలో ఉన్న హిందూ సమాజ సభ్యులను సంప్రదించి, మైనారిటీలపై దాడులకు పాల్పడిన వారిని తమ ప్రభుత్వం శిక్షిస్తుందని వారికి హామీ ఇచ్చారు. గురువారం తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు స్వీకరించిన ముహమ్మద్ యూనస్ (84) ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటైన ఢాకేశ్వరిని సందర్శించి తమ ప్రభుత్వంపై ఓ అభిప్రాయం ఏర్పర్చుకొనే ముందు “ఓర్పుతో మెలగండి” అంటూ హిందువులను కోరారు.
 
మైనార్టీలపై దాడులకు పాల్పడినవారిని తమ ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. “హక్కులు అందరికీ సమానం. మనమందరం ఒకే హక్కు కలిగిన వ్యక్తులం. మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కల్పించవద్దు. దయచేసి మాకు సహాయం చేయండి. ఓపిక పట్టండి, తర్వాత తీర్పు చెప్పండి — మేము ఏమి చేయగలిగామో, ఏమి చేయలేదో చూడండి. మేము విఫలమైతే, అప్పుడు మమ్మల్ని విమర్శించండి” అని యూనస్ కోరారు. 
 
ఢాకేశ్వరి ఆలయం వద్ద బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్, మహానగర్ సర్బజనిన్ పూజా కమిటీ నాయకులతో పాటు ఆలయ నిర్వహణ బోర్డు అధికారులు,  భక్తులతో యూనస్ సమావేశమయ్యారు. “మన ప్రజాస్వామ్య ఆకాంక్షలలో, మనల్ని ముస్లింలుగా, హిందువులుగా లేదా బౌద్ధులుగా చూడకూడదు. కానీ మనుషులుగా చూడాలి. మన హక్కులకు భరోసా కల్పించాలి. అన్ని సమస్యలకు మూలం సంస్థాగత ఏర్పాట్ల క్షీణతలో ఉంది. అందుకే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సంస్థాగత ఏర్పాట్లు పరిష్కరించాల్సిన అవసరం ఉంది, ”అని యూనస్ వారికి వివరించారు.
 
 ప్రొఫెసర్ యూనస్‌తో పాటు న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, మత వ్యవహారాల సలహాదారు ఖలీద్ హుస్సేన్ కూడా ఉన్నారు. అధ్యక్షుడు పూజ ఉద్జపన్ పరిషత్ బాసుదేబ్ ధర్, దాని ప్రధాన కార్యదర్శి సంతోష్ శర్మ, సర్బజనిన్ పూజ కమిటీ అధ్యక్షుడు జయంత కుమార్ దేవ్, ప్రధాన కార్యదర్శి తపస్ చంద్ర పాల్, హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యత మండలి ప్రెసిడియం సభ్యుడు కాజోల్ దేబ్ నాథ్,  జాయింట్ జనరల్ సెక్రటరీ మణీంద్ర కుమార్ నాథ్ కూడా ఉన్నారు.
యూనస్‌తో జరిగిన సమావేశాన్ని “సహృద్భావము” అని ధర్ అభివర్ణించారు.