దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఆరోసారి మద్రాస్ ఐఐటీ

దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఆరోసారి మద్రాస్ ఐఐటీ

దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సి) బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది. మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి.

టాప్-10 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో మొత్తం 8 ఐఐటీలు, దిల్లీ ఎయిమ్స్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌ వర్క్‌(ఎన్ఐఆర్ఎఫ్) కింద కేంద్ర విద్యాశాఖ సోమవారం ఈ జాబితాను విడుదల చేసింది.  ఈ ర్యాంకింగ్‌లను ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ nirfindia.orgలో పరిశీలించవచ్చు. విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్‌లను మెడికల్, ఇంజనీరింగ్, లా, మేనేజ్‌మెంట్, డెంటల్, ఫార్మసీ.. సహా 16 విభాగాలలో విడుదల చేస్తుంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ తొమ్మిదో ఎడిషన్ నివేదిక ప్రకారం, మొత్తం కేటగిరీలో టాప్ 10 కాలేజీలలో 7 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు స్థానం సంపాదించాయి. ముఖ్యంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో మొత్తం విభాగంలో ఆరోసారి తన ర్యాంకింగ్‌ను కొనసాగించింది.

మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ టాప్-10 జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. ఫార్మసీలో జామియా హమ్‌ దర్ద్‌ ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. గతేడాది ఈ యూనివర్సిటీ రెండో స్థానంలో ఉండేది. 

2023లో తొలిస్థానంలో ఉన్న హైదరాబాద్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోగా, బిట్స్ పిలానీ మూడో స్థానంలో నిలిచింది.  ఉత్తమ కళాశాలగా ఢిల్లీ యూనివర్శిటీలోని హిందూ కళాశాల ఎంపికైంది. మిలాండా హౌస్, సెయింట్ స్టీఫెన్స్ కళాశాల వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.

వైద్య విద్యలో దిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. చండీగఢ్లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆర్కిటెక్చర్లో ఐఐటీ రూర్కీ అగ్రస్థానాన్ని సంపాదించింది. ఐఐటీ ఖరగ్పుర్, ఎన్ఐటీ కాలికట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఉత్తమ రాష్ట్ర విశ్వవిద్యాలయంగా చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నిలిచింది. కోల్కతాలోని జాదవ్పుర్ యూనివర్సిటీ రెండో స్థానాన్ని సంపాదించింది. న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

పరిశోధన విభాగంలో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌లు విద్యాసంస్థల గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఈ పద్ధతి ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం, విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ప్రోత్సహించడం, భారతదేశంలో ఉన్నత విద్య మొత్తం నాణ్యతను పెంపొందించడానికి దోహదపడుతుంది.

పారదర్శకతను పెంపొందించడానికి, పోటీని పెంపొందించడానికి భారత ప్రభుత్వం  ఆధ్వర్యంలోని విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యా సంస్థలను పరిశీలించి ర్యాంక్ చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బోధన-అభ్యాసం, వనరులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, ఔట్రీచ్, చేరిక, మొత్తం విద్యా సంస్థ అభివృద్ధిలాంటి అంశాలను పరిశీలిస్తుంది.

బోధన-అభ్యాసం, వనరుల కోసం 30 శాతం. పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం కోసం 30 శాతం, గ్రాడ్యుయేషన్ ఫలితాల కోసం 20 శాతం. ఔట్‌రీచ్, ఇన్‌క్లూసివిటీ మరియు పర్సెప్షన్ కోసం ఒక్కొక్కటి 10 శాతంగా చూసి లెక్కిస్తారు. తర్వాత ర్యాంకులు ప్రకటిస్తారు. చాలా ఏళ్లుగా ఐఐటీ మద్రాస్ ఈ  ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తుంది.