కాంగ్రెస్‌తో కలసి దేశ ప్రతిష్ఠను హిండెన్‌బర్గ్ దెబ్బ తీసింది

కాంగ్రెస్‌తో కలసి దేశ ప్రతిష్ఠను హిండెన్‌బర్గ్ దెబ్బ తీసింది

హిండెన్‌బర్గ్ రీసర్చ్ కాంగ్రెస్‌తో కుమ్మక్కై దేశాన్ని అపఖ్యాతి పాల్జేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ఆ యుఎస్ షార్ట్ సెల్లర్ సంస్థపై ‘అత్యంత కఠిన చర్య’ తీసుకోనున్నట్లు మంత్రి ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ‘దేశం పరువు తీస్తున్న ముఠా ఇది. రాహుల్ (గాంధీ), జైరామ్ రమేష్, హిండెన్‌బర్గ్ మమ్మల్ని అపఖ్యాతి పాల్జేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“దేశానికి జరుగుతున్న ఈ అవమానాన్ని మేము సహించబోం. వీరు దేశానికి శత్రువులు. హిండెన్‌బర్గ్‌పై ఇప్పుడు అత్యంత కఠిన చర్య తీసుకుంటాం” అని గిరిరాజ్ చెప్పారు. రాహుల్ గాంధీని ‘బడే బాప్ కా బేటా’ అని గిరిరాజ్ పేర్కొంటూ, ‘రాహుల్‌కు రాష్ట్రం, దేశ పథం గురించి ఏమీ తెలియదు’ అని విమర్శించారు. 

అయోమయాన్ని, భయాన్ని సృష్టించజూస్తున్న అటువంటి వ్యక్తుల పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జెపిసి దర్యాప్తు కోసం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ల గురించి ప్రశ్నించగా, ‘హిండెన్‌బర్గ్ వెనుక కాంగ్రెస్ ఉంది. భారత్‌ను నాశనం చేసే ఉపకరణం హిండెన్‌బర్గ్. రాహుల్ గాంధీ వంటి వారికి దీనిలో ప్రమేయం ఉంది’ అని గిరిరాజ్ సింగ్ సమాధానం ఇచ్చారు.