ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి

ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి

ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయనుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగిపోతున్నాయని తెలిపింది. ఇంతవరకు ఘర్షణ వాతావరణం వరకే పరిమితమైన ఉద్రిక్తత పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. 

టెహ్రాన్‌లో హమాస్‌ అగ్రనేత హనియె హత్యానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. అటు తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని పంపుతున్నట్లు ప్రకటించింది. 

ఇప్పటికే బయల్దేరిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌ రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గలాంట్‌తో ఆస్టిన్​  ఆదివారం రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు.

 ఇజ్రాయెల్‌ రక్షణకు అగ్రరాజ్య కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆస్టిన్‌ తెలిపారు. రానున్న 24 గంటల్లోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్, లెబనాన్‌లు దాడి చేయనున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఇరాన్ మాత్రం ఏ విషయంలో తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్యలు నుంచి రక్షించుకునే విషయంలో ముస్లిం దేశాలు తమకు అండగా నిలబడాలని ఇరాన్‌ కోరుతోంది. సౌదీ అరేబియా జెడ్డాలో జరిగిన ఇస్లామిక్‌ సహకార సంస్థ- (ఓఐసీ) అత్యవసర సమావేశంలో ఇరాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఈ మేరకు ఆయా ముస్లిం దేశాలకు విజ్ఞప్తి కూడా చేశారు. 

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియా హత్య నేపథ్యంలో ఇరాన్‌ వినతిపై, ఇస్లామిక్‌ సహకార సంస్థ సమావేశమైంది. హనియా హత్యను పాశ్చాత్య దేశాలు ఖండించలేదని, ప్రాంతీయ స్థిరత్వంపై వాటికి ఆసక్తి లేదని ఇరాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఘెరీ కని ఆరోపించారు. హనియా హత్యలో ఇజ్రాయెల్‌, అమెరికా పాత్ర ఉందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. దానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్‌ ప్రతినబూనింది కూడా.