బంగ్లాదేశ్‌లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం

బంగ్లాదేశ్‌లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్‌ వచ్చిన హసీనా, ఇటీవల జరిగిన పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు. బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు. తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె, వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకొన్నారని విమర్శించారు. 

అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు. ఒక వేళ తాను సెయింట్ మార్టిన్‌ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేదికాదని పేర్కొన్నారు. దయ చేసి అతివాదుల మాయలోపడొద్దని బంగ్లాదేశ్‌ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. 

చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె భగవంతుని దయవల్ల త్వరలోనే తిరిగి వెళతానని, అవామీ లీగ్‌ మరోసారి నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

“నేను దేశంలోనే ఉండి ఉంటే, ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి, మరిన్ని వనరులు నాశనం అయ్యేవి. నేను నిష్క్రమించడానికి చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మీ నాయకురాలినయ్యాను, మీరే నా బలం” అని హసీనా తెలిపారు.
 
తన తమ పార్టీ నాయకుల హత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన హసీనా, “చాలా మంది నాయకులు చంపబడ్డారని, కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని, వారి ఇళ్లను ధ్వంసం- దహనాలకు  గురిచేస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు నా హృదయం ఏడుస్తుంది… సర్వశక్తిమంతుడైన అల్లా దయతో నేను త్వరలో తిరిగి వస్తాను. అవామీ లీగ్ మళ్లీ మళ్లీ నిలబడుతుంది” అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
 
“నా గొప్ప తండ్రి కృషి చేసిన దేశం బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తాను. నా తండ్రి, కుటుంబం తమ ప్రాణాలను అర్పించిన దేశం” అని చెప్పారు. కోటా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఆందోళనకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తమను రెచ్చగొట్టేలా తన ప్రకటనలను వక్రీకరించారని హసీనా ఆరోపించారు.
కాగా విద్యార్థులను తానెప్పుడూ రజాకార్ అని పిలవలేదని, తన ప్రకటనను వక్రీకరించారని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. రిజర్వేషన్ల కోటా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఆందోళనకారులను రెచ్చగొట్టేలా తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. “ ఈ విషయాన్ని నేను బంగ్లాదేశ్ యువ విద్యార్థులకు మరోసారి స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేనెప్పుడూ మిమ్మల్ని రజాకార్లు అనలేదు. మిమ్మల్ని ప్రేరేపించడానికి నా మాటలను వక్రీకరించారు. ఆ రోజు నేను మాట్లాడిన పూర్తి వీడియోను చూడాల్సిందిగా కోరుతున్నాను. అమాయకత్వాన్ని ఉపయోగించుకుని కుట్రదారులు దేశాన్ని అస్థిరపరిచేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు” అని షేక్ హసీనా పేర్కొంది.