పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడకపోతే రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని ఆయన హెచ్చరించారు.
ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు నితిన్ గడ్కరీ లేఖ రాశారు. రూ.14,288 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు పంజాబ్ లో భద్రత దృష్ట్యా జాప్యం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జలంధర్‌లో ‘ఢిల్లీ- అమృత్ సర్ – కట్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు జరిగాయి. ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు జరిగాయి.
ఈ ఎనిమిది గ్రీన్ ఫీల్డ్ కారిడార్లలో ఒక సెగ్మెంట్ రద్దు చేసే అవకాశం ఉంటుందని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు రాసిన లేఖలో నితిన్ గడ్కరీ.. ఎన్ హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్లు, సిబ్బంది భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పెండింగ్ లో ఉన్నదని కూడా కేంద్ర మంత్రి గుర్తు చేశారు.గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కానరాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని విచారం వ్యక్తం చేశారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి