కాంస్య పోరులో మెరిసిన సెహ్రావత్‌

కాంస్య పోరులో మెరిసిన సెహ్రావత్‌

* ప్రధాని మోదీ అభినందనలు

స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ పసిడి పతక ఆశలు ఆవిరైన వేళ తాను ఉన్నానంటూ యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ చిరుతలా దూసుకొచ్చాడు. జపాన్‌ రెజ్లర్‌ చేతిలో సెమీస్‌లో ఓడిన అమన్‌..కాంస్య పతక పోరులో బెబ్బులిలా విరుచుకుపడ్డాడు. పూర్టోరికో రెజ్లర్‌ క్రజ్‌ డెరియన్‌కు చుక్కలు చూపిస్తూ వరుస రౌండ్లలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 
 
ఆదిలో నెమ్మదించినా..పట్టు బిగించిన తర్వాత ప్రత్యర్థిని మెలికలు తిప్పుతూ వరుస పాయింట్లు కొల్లగొట్టాడు. డెరియన్‌ పుంజుకునేందుకు ఏ మాత్రం అవకాశమివ్వని అమన్‌..అతి పిన్న వయసులో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించి ఔరా అనిపించాడు.
 
అమన్‌ కాంస్య పతకంతో వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకాలు మనకు దాసోహమయ్యాయి.  పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో బరిలోకి దిగిన అమన్‌ సెమీస్‌లో ఓడినా కాంస్య పోరులో మాత్రం అదరహో అనిపించాడు.  శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమన్‌ 13-5తో క్రజ్‌ డెరియన్‌ (పూర్టోరికో)ను ఓడించి కంచు మోత మోగించాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు పారిస్‌లో ఇదే తొలి పతకం కాగా మొత్తంగా ఆరోవది. భారత్‌ తరఫున అత్యంత పిన్న వయస్సు(21ఏండ్లు) లో ఒలింపిక్‌ పతకం నెగ్గిన తొలి ప్లేయర్‌ గా నిలిచాడు. 
మొదటి రౌండ్‌ ముగిసేసరికి 6-3 ఆధిక్యంలో ఉన్న అతడు రెండో రౌండ్‌లో దూకుడును మరింత తీవ్రతరం చేశాడు.  ముక్కుపై గాయమై రక్తపు చుక్కలు కారుతున్నా వెరువకుండా ఆటను కొనసాగించాడు. అమన్‌ ‘పట్టు’కు తొలి బౌట్‌లో కాస్త ప్రతిఘటించిన పూర్టోరికో రెజ్లర్‌ కీలకమైన రెండో రౌండ్‌లో మాత్రం చేతులెత్తేశాడు. వీలు చిక్కినప్పుడల్లా అతడిని కిందపడేస్తూ పాయింట్లు రాబట్టడమే గాక ప్రత్యర్థిని ఊపిరాడనీయకుండా చేయడంలో అమన్‌ సఫలీకృతుడయ్యాడు.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించి భారత్‌కు ఐదో కాంస్య పతకాన్ని అందించిన అమన్ సెహ్రావత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. “మన రెజ్లర్లకు మరింత గర్వకారణం! ప్యారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినందుకు అమన్ సెహ్రావత్‌కు అభినందనలు. అతని అంకితభావం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ఈ అద్భుతమైన ఫీట్‌ని జరుపుకుంటుంది” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
 
ఈ సంవత్సరం పోటీ పడుతున్న భారతదేశం తరపున సెహ్రావత్ ఏకైక పురుష మల్లయోధుడు కావడం, ఆ వ్యక్తి ఒలింపిక్ క్రీడలలో తన తొలి ప్రదర్శనలో చరిత్ర సృష్టించడం గమనార్హం. రెండో రౌండ్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించడానికి ముందు క్రజ్ మ్యాచ్‌లో ఎక్కువ భాగం బాగా పోరాడి కాంస్య పతకాన్ని సాధించడం ఉత్కంఠభరితంగా మారింది.