హైదరాబాద్‌లోకి బంగ్లాదేశ్‌ పౌరులు… పోలీసుల అప్రమత్తం

హైదరాబాద్‌లోకి బంగ్లాదేశ్‌ పౌరులు… పోలీసుల అప్రమత్తం
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయిన నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతుండటంతో చాలా మంది బంగ్లాదేశ్ వాసులు ఆ దేశం నుంచి పారిపోతున్నారు. ఈ క్రమంలోనే వారు హైదరాబాద్ నగరంలోకి వస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తం అయిన హైదరాబాద్ పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలోనే నగరంలోని బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, పహడీషరీఫ్, ఫలక్‌నుమా వంటి ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇక గతంలో హైదరాబాద్‌లోకి భారీగా వలసవచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ప్రజలు చిరువ్యాపారులుగా, పరిశ్రమలు, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తూ ఇక్కడే పూర్తిగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 

 
ఇలాంటి వారు అప్పుడప్పుడూ అక్రమంగా బంగ్లాదేశ్‌కు వెళ్లి వస్తున్నట్లు తాజాగా ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వారి రాకపోకలు ఎక్కువ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.  చాలా రోజులుగా బంగ్లాదేశ్‌ నుంచి ఎంతోమంది అక్రమంగా హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వస్తున్నారు. 
 
బాల కార్మికులను గుర్తించే ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా 2 నెలల క్రితం కోల్‌కతా నుంచి ఖమ్మం వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు మైనర్లను అధికారులు పట్టుకున్నారు. వారంతా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ మైనర్లను బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించారు. 
 
మరోవైపు ఇటీవల సికింద్రాబాద్‌లో ఓ మైనర్‌ సహా ఐదుగురు పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. చాంద్రాయణగుట్టలో ఉన్న తమ బంధువులు తమను బంగ్లాదేశ్ నుంచి రప్పించినట్లు చెప్పారు. దీంతో వీరిని అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకుని వారి బంధువులు కనిపించకుండా పోయారు.
 
మరోవైపు ఇప్పటికే అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ వాసులు దళారులుగా మారుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీల్లో పనిచేసేందుకు బంగ్లాదేశ్ పౌరులను రప్పిస్తున్నారు. వారిని అక్రమంగా భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దు దాటించి రైళ్లలోకి చేర్చేంతవరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్న ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. 
 
ఇందుకుగాను ఒక్కొక్కరికీ రూ.5 వేల వరకు కమీషన్‌ ఇస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటి కోల్‌కతాకు పంపిస్తారు. అక్కడ నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను తయారుచేసి వారికి ఇచ్చి కోల్‌కతా నుంచి రైలులో తెలంగాణకు పంపిస్తున్నట్లు ఇటీవల కొంతమంది నిందితులను పట్టుకున్న పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. ఇలా గత 2 ఏళ్లలోనే బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు వెయ్యి మందికి పైగా వచ్చారని పోలీసులు అంచనా వేస్తున్నారు.